ఏమిటీ వింత పేరు అనుకుంటున్నారా ?
ముందు అసలు ఆరెస్‌ఎస్ అంటే తెలియని వారు ఒకసారి ఈ టపా చదవండి.

ఇవాళ ఆరెసెస్‌ని సమాచార సేకరణకు ఎలా ఉపయోగిస్తున్నారో చాలా మందికి తెలిసిందే.
అయితే ప్రస్తుతం ఉన్న ఆరెసెస్ పని చేసే విధానంలో ఎన్నో లోపాలున్నాయి.

ఎలాగంటే ఉదాహరణకి కూడలి లేదా జల్లెడ వంటి ఒక అగ్రిగేటర్‌ని తీసుకోండి. అవి ఎలా పనిచేస్తాయి అని చూస్తే బ్లాగులకి చెందిన వందలాది ఫీడ్లను ఒక నిర్ణీత సమయంలో పింగ్ చేసి కొత్త టపాలున్నాయో లేదో గమనించి, ఉంటే ఆ కొత్త టపాని దాని సంగ్రహాన్ని తెచ్చుకుని మనకి ఒక దగ్గర చూపిస్తాయి.
మరి ఇందులో చిక్కేమిటి ?

ఈ సన్నివేశాన్ని ఊహించుకోండి:
నేను నెలకి ఒక టపానో, రెండు టపాలో వ్రాస్తాను.
తెలుగోడు బ్లాగో, చదువరి బ్లాగో, కొత్తపాళీ బ్లాగో వారానికి కనీసం ఒకసారయిన టపా వ్రాస్తారు.
వీవెన్ ఏ రెండు మూడు నెలలకో ఒక టపా వ్రాస్తాడు.

మరి కూడలి లేదా జల్లెడ ఏం చేస్తుంది. ప్రతీ రోజూ (గంటల వ్యవధి కూడా కావచ్చు) నా బ్లాగుకీ, చదువరి బ్లాగుకీ, వీవెన్ బ్లాగుకీ వెళ్ళి కొత్త టపా వ్రాసామో లేదో చూసొస్తుంది.

మరి ఇందులో ఎంత సమయం, ప్రాసెసింగు పవరు, శ్రమ వృధా ?
ఇటు కూడలి బ్యాండ్‌విడ్త్ అనవసరంగా ఉపయోగించబడుతుంది. అటు ఆయా బ్లాగుల/సైటుల బ్యాండ్‌విడ్తూ అనవసరంగా ఉపయోగించబడుతుంది.


మరి దీనికి పరిష్కారం ఉందా ? ఉంది.
బ్లాగులని/కంటెంటుని నవీకరించే సమయాన్ని బట్టి వేరు వేరు జాబితాలు తయారు చేసుకుని ఆ ప్రకారం వాటి ఫీడ్లను పింగ్ చేసి, వాటి నుంచి సరికొత్త కంటెంటుని తెచ్చుకోవడం.

కానీ ఇందులోనూ పైవాటిలో ఉన్న సమస్యలు తీరిపోవు, పైగా ఎంతో శ్రమతో కూడుకున్న పని.

ఇందులోని సమస్య ఆరెసెస్‌ పని చేసే విధానానికి సంబంధించినది. అది రియల్ టైమ్ కోసం తయారు చెయ్యబడినది కాదు. (ప్రస్తుతం పింగ్ విధానం ఉంది కానీ అదీ సమర్థవంతం కాదు)

ఈ సమస్యని పరిష్కరించడానికి కొత్తగా ప్రతిపాదించినదే ఈ "పబ్‌సబ్‌హబ్‌బబ్‌" అనే వింత పేరు గల ప్రోటోకాల్.
ఇందులో ముఖ్య పాత్రధారులు పబ్, హబ్, సబ్. పబ్ అంటే పబ్లిషర్లు, సబ్ అంటే సబ్‌స్క్రైబర్లు, హబ్ అంటే ఫీడు కంటెంటుని డీసెంట్రలైజు చేసేది.

ఇదెలా పని చేస్తుందో చూద్దాము:
  1. మొదట ఒక ఆరెసెస్ ఫీడు (పబ్లిషరు), దానికి సంబంధించిన "హబ్"లని ప్రకటిస్తుంది తన ఫీడులో. అంటే నేను కనుక నా కంటెంటుని నవీకరిస్తే అది హబ్ దగ్గర లభ్యమవుతుందని చెప్పడమన్నమాట.
  2. ఆ తరువాత ఒక సబ్‌క్రైబరు నేను ఈ ఫీడుకి చందాదారుడిని కావాలనుకుంటున్నానని పబ్లిషరుని అడిగినప్పుడు ఆ పబ్లిషరు తన ఫీడులో ఉన్న హబ్‌కి ఆ విన్నపాన్ని రీడైరెక్టు చేస్తుంది.
  3. సబ్‌స్క్రైబరు ఆ హబ్‌ని తనకు కావలసిన ఫీడు కోసం అభ్యర్థిస్తుంది. ఆ అభ్యర్థనలో ఒక కొత్త నవీకరణ వచ్చినప్పుడు ఎక్కడ నోటీఫై చెయ్యాలో కూడా చెబుతుంది ఒక యూఆర్‌ఎల్ ద్వారా.
  4. హబ్ ఆ అభ్యర్థన స్పామ్ అవునో కాదో నిర్థారిస్తుంది ఒక మెసేజీ ద్వారా. ఆ తర్వాత సబ్‌స్క్రిప్షన్ పూర్తి అయినట్టే.
  5. తర్వాత ఒక ఫీడు గనక నవీకరించబడినట్లయితే పబ్లిషరు తన హబ్‌లకి ఒక నోటిఫికేషను పంపుతుంది నా దగ్గర కొత్త కంటెంటు ఉంది అని.
  6. హబ్‌లు ఆ పబ్లిషరుని ఆ కంటెంటు పంపమని కోరతాయి.
  7. పబ్లిషరు ఆ కంటెంటుని హబ్‌లకి పంపుతుంది.
  8. హబ్‌లు తమ సబ్‌స్క్రైబర్లకు ఆ కంటెంటుని చేరవేస్తాయి, ఇంతకు ముందు ఇచ్చిన యూఆర్‌ఎల్ ద్వారా.
చిత్రాలతో వివరంగా ఈ కింది ప్రెజెంటేషను చూడండి:



పైన చెప్పిన పద్ధతి ద్వారా ఆరెసెస్ ఫీడ్ల కంటెంటు పబ్లిషర్ల నుంచి సబ్‌స్క్రైబర్లకు చేరుతుంది.

ఈ కొత్త పద్ధతి ద్వారా లాభాలు:
  • రియల్ టైమ్ కంటెంటు - అంటే కంటెంటు పబ్లిష్ అవగానే అది వెంటనే సబ్‌స్క్రైబర్లకి చేరుతుంది. ఇంతకు ముందయితే సబ్‌స్క్రైబర్లు తరచూ పబ్లిషరుని పింగ్ చేసి నవీకరణల కోసం అడగాల్సి వచ్చేది. ఈ పద్ధతి ద్వారా కంటెంటు సబ్‌స్క్రైబరు వద్దకి చేరుతుంది. (అంటే పుల్ కాకుండా పుష్ అన్నమాట), అదీ రియల్‌ టైములో. అంటే పబ్లిషరు పబ్లిష్ చెయ్యగానే సబ్‌స్క్రైబరు దగ్గరకి వెంటనే కంటెంటు చేరుతుంది. ఉదా: ఫ్రెండ్‌ఫీడ్ వంటి సైట్లు ఈ ప్రోటోకల్‌ని సపోర్టు చేస్తున్నాయి.
  • పబ్లిషరుపై భారం తగ్గుతుంది - ఉదా: ఒక వంద అగ్రిగేటర్లు లేదా ఫీడ్ రీడర్లు ఉన్నాయనుకుందాం. ప్రస్తుత పద్ధతి ద్వారా వంద అప్లికేషన్లు ప్రతీ నిర్ణీత సమయంలో పబ్లిషరుని కొత్త ఫీడు కోసం అడుగుతాయి. అవసరం ఉన్నా లేకపోయినా. బ్యాండ్‌విడ్త్ అనవసరంగా ఉపయోగించబడుతుంది. అదీ కాక ఒకేసారి వంద మంది పబ్లిషరుపై భారం మోపితే డినయల్ ఆఫ్ సర్వీసు అవచ్చు.
    కానీ ఈ కొత్త పద్ధతి ద్వారా ఈ రిక్వెస్ట్ - రెస్పాన్స్ డీ-సెంట్రలైజు అవుతుంది. అంటే సబ్‌స్క్రైబర్లు పబ్లిషరుని నేరుగా కంటెంటు కోసం అడగరు. వారు హబ్‌లని అడుగుతారు. అందుకని వాటి మీద నేరుగా భారం ఉండదు. అదీ కాక ఎన్ని ఎక్కువ హబ్‌లు ఉంటే అంత స్కేలబుల్. ఇంకో ముఖ్యమయిన విషయం హబ్‌లు కూడా ఒక ఇతర హబ్‌లని కంటెంటు అడగవచ్చు. కాబట్టి ఒక హయరార్కీగా డీ-సెంట్రలైజు చెయ్యవచ్చు.
అందుకని ఇది అందరికీ ప్రయోజనకరం. అయితే ఈ ప్రోటోకాల్‌ని ఎంత త్వరగా వివిధ అప్లికేషన్లు సపోర్ట్ చేస్తాయి అనేదాన్ని బట్టి ఉపయోగం ఉంటుంది.

ఈ ప్రోటోకల్ గూగుల్‌లో పని చేసే వారి ద్వారా సృష్టించబడింది. అందులోని బ్రాడ్ ఫిట్జ్‌పాట్రిక్ ఇంతకు ముందు లైవ్‌జర్నల్ ని సృష్టించాడు, మెమ్‌కాష్డ్ వంటి ఏపీఐలకీ, ఓపెన్ ఐడీ వంటి ఆలోచనలకి ఆద్యుడు.
గూగుల్ చే ఎక్కువగా ప్రమోట్ చేయబడుతుంది ఈ ప్రోటోకాల్. దీనికి పోటీగా ఆరెసెస్‌క్లౌడ్ అనే ఇంకో ప్రోటోకాల్ కూడా ఉంది. దాని కంటే ఇది మెరుగని జనాల ఉవాచ.

ప్రస్తుతానికి ఒక హబ్‌ని గూగుల్ ఇక్కడ హోస్ట్ చేస్తుంది. తమ ఫీడ్లకి పబ్‌సబ్‌హబ్‌బబ్ సపోర్ట్ చెయ్యాలనుకునే వారు దానిని ఉపయోగించవచ్చు. గూగుల్ రీడర్ ఒక సబ్‌స్క్రైబరుగా ఈ ప్రోటోకాల్‌ని ఇప్పటికే సపోర్ట్ చేస్తుంది. బ్లాగరు బ్లాగులలో పబ్లిషరుగా ఈ ప్రోటోకాల్ చేతనం చేయబడింది.

మరిన్ని వివరాలకు ప్రాజెక్టు హోమ్ పేజీ చూడండి.

6 comments:

aswin budaraju said...

Great

Sravya Vattikuti said...

Thanks for sharing the useful info !

ప్రవీణ్ గార్లపాటి said...

@aswin, @Sravya:
థాంకులు!

శ్రీనివాస్ చింతకింది said...

Thanks Praveen for sharing the useful info. You are the man!!!

nelabaludu said...

Very informative..!

suresh said...

superb