పండుగలంటే సెలవులు మాత్రమే అయి చాలా రోజులయింది. కనీసం మరి సెలవులనయినా సరిగా ఉపయోగించుకోవాలి కదా!
అందుకే ఈ రోజు "మధుగిరి" అనే ప్రదేశానికి ట్రెక్కు ఖాయం చేసుకున్నాను. అన్ని ఇతర ట్రెక్కుల్లాగానే ఇదీ ఆఖరు నిముషంలో అనుకున్నది. సహోద్యోగి అయిన "సుందర పాండ్యను"డి తో కలిసి దీనికి వెళ్ళాలని ఆదివారం పూట నిశ్చయమయింది.

ట్రెక్కు వివరాలలోకి వెళ్ళే ముందు స్థలం గురించి కొంత.

"మధుగిరి" అనేది "తుమకూరు" జిల్లాలోని ఒక పట్టణం(?). పట్టణం కాదు లెండి ఒక చిన్న పల్లెనే. అది ప్రశస్తి చెందింది "మధుగిరి" వలనే. మధుగిరి ఆసియా ఖండంలోని రెండో అతి పెద్ద ఒంటి రాయి కొండ. దాదాపు నాలుగు వేల అడుగుల ఎత్తుంటుంది (3930 ft).
ట్రెక్కు మొదలుపెట్టే ముందే మాకు తెలుసు ఆ ఊరిలో ఆ గిరి తప్పితే ఏమీ ఉండదని. అందుకని ట్రెక్కుని మరింత ఆసక్తికరంగా చెయ్యడం కోసం ఆ నూట ఇరవై కిలోమీటర్ల దూరం బైకు మీద వెళదామని నిశ్చయించుకున్నాము. సరే మరుసటి రోజు పొద్దున్నే బయలుదేరాలని నిశ్చయించుకుని ఆ రోజుకి దుకాణం కట్టేసాము.

మామూలు రోజులలో అయితే పొద్దున్నే లేవలేను కానీ ఎవరికయినా మాటిచ్చినప్పుడు, పని ఉన్నప్పుడు ఠక్కున లేవడం నాకు అలవాటు. అలాగే పొద్దున్న ఐదున్నరకి లేచి స్నానం చేసి అమ్మ కలిపిచ్చిన కాఫీ తాగి సుందరునికి ఫోను కలిపాను. అతని గొంతు వినగానే అర్థమయింది అతనప్పుడే లేచాడని. (అదే మరి, అందరూ నన్ను అనవసరంగా అంటారు :)

సరే ఎలాగయితే అని అతని ఇల్లు అడ్రసు కనుక్కుని ఒక ఇరవై నిముషాలకి చేరాను. అతను తయారయేంతలో గూగుల్ రీడరు, న్యూసు, ఫేస్‌బుక్ తిరగేసి మళ్ళీ ఓ కాఫీ తాగాము. నా బండిని అక్కడే వదిలేసి (పాపం పల్సరే నెగ్గింది హోండా మీద) బయలుదేరాము.

నిజం చెప్పాలంటే నేను "Directionally challenged". అంటే నాకు రూట్లు, ప్రదేశాలూ ఆట్టే గుర్తుండవు. కానీ నాకు ఫక్తు వ్యతిరేకం మా సుందరుడు. అతనికి గూగుల్ ఎర్త్ అంటే పిచ్చి. దాంట్లో ఎన్నో ప్రదేశాలు తిరుగుతుంటాడు. వాడు దాన్నుపయోగించేంతలో ఒక పదో శాతాన్ని కూడా నేనుపయోగించను. మేము వెళ్ళే ముందు రోజు రాత్రే వాడు మధుగిరి దారి మొత్తం చీల్చి చండాడాడు. ఏ కిలోమీటరు రాయి దగ్గర ఎలా మలుపు తిరగాలో మొత్తం రాసుంచాడు. పర్ఫెక్టుగా అలాగే వెళ్ళా

ఇక పొద్దున్నే బయలుదేరడం వలన ఒక ప్రయోజనం ట్రాఫిక్కుండదు. అయినా సిటీ బయటికొచ్చేంత వరకూ చికాగ్గానే ఉంటుంది. బయటయితే చక్కగా చెట్లూ చేమలో, పంట పొలాలూ...
మధుగిరికి వెళ్ళే దారి NH4. దానికి కలిసిన తరువాత మా బండి మా జోరందుకుంది. మామూలుగా తొంభై, కుదిరితే ఓ ఐదు కిలోమీటర్లెక్కువ.

ఎప్పటిలాగానే నా ట్రెక్కు ఇష్టదైవమైన ఆంజనేయస్వామి దర్శనంతోనే మొదలయింది. నా అన్ని ట్రెక్కులూ దాదాపు అంతే. ఆయన దర్శన భాగ్యం ఉండాల్సిందే.

Starting of the trip with mighty hanuman...

తరువాయి స్టాపు ఫలహారానికే. హైవే మీదున్న "న్యూ అగర్వాల్ భవన్" దగ్గర బండి ఆగింది. పేరు చూసి ఏమోలే అనుకున్నాను గానీ ఈ మధ్య కాలంలో ఎప్పుడూ అంతటి చక్కని మసాలా దోశ తినలేదంటే నమ్మండి. దాని తర్వాత ఒక ఫిల్టరు కాఫీ పట్టించి మళ్ళీ బయలుదేరాము. ఈ సారి బైకు నా వంతు. మళ్ళీ తొంభై, +ఐదు మామూలే. అసలు ఆ హైవే మీద వేగం తెలియదంటే నమ్మండి.

అయితే అంత వేగంగా నడిపినా నేను చాలా జాగ్రత్తగా అన్ని రూల్సూ పాటిస్తూ నడుపుతానని ఇక్కడ అందరికీ మనవి చేసుకుంటున్నాను :-)

అలా ముందుకు సాగే కొద్దీ పచ్చదనం చుట్టూతా పరచుకుంటోంది. ఈ విషయంలో కర్ణాటక రాష్ట్రం అంటే నాకెంతో ఇష్టం.
మధ్యలో అత్యవసర సమావేశాలకు ఆగుతూ ఓ చెట్టునీ, ఓ చెలమనీ పలకరించాము.

Love these trees. They get clicked automatically

An attempt to capture the image of the hill in water

కొంత దూరం వెళ్ళిన తరువాత పొద్దు తిరుగుడు పూలు కనిపించాయి. ఎంత అందంగా ఉన్నాయో

Beautiful sunflowers on the way

NH4 మీద కట్టు కొట్టి కొరటగెరె అనే ప్రదేశానికి చేరుకుని అక్కడి నుంచి ఎట్టకేలకు మధుగిరి చేరుకున్నాము. హైవే మీద లేనప్పుడు వేగం బాగానే మందగించింది. అదీనూ మధ్యలో బ్రేకులకీ సమయం ఖర్చవగా పదకొండున్నరకి దాదాపు చేరుకున్నాము.

అక్కడే నా ట్రెక్కులోని అతి పెద్ద తప్పిదం చేసాను. ఇద్దరమూ చెరో "ఛాయ్" పట్టించాము. వాడి దగ్గర బ్యాగులో బిస్కెట్లు, జ్యూసులూ వగైరా సరి చూసుకుని హెల్మెట్టుని అక్కడే ఒక తెలుగతని కొట్లో పెట్టి కొండ ఎక్కడానికి బయలుదేరాము.

కింది నుండి చూస్తే ఇదుగో ఇలా ఉంటుంది కొండ.

The hill to be conquered - "Madhugiri"

నా ఫిట్‌నెస్ మీద నాకు చాలానే అపనమ్మకాలున్నాయి. ఎందుకంటే ఈ మధ్య పని ఒత్తిడిలో పడి అసలు జిమ్ముకెళ్ళి కండ పెంచట్లేదు. అలాగే ఇల్లు మారడంలో బిజీగా ఉండి (దీని గురించి మరోసారి) తీరిక లేక ఎలాంటి ఎక్సర్‌సైజూ లేకుండా పోయింది.
సరేలే కానీమని బయలు దేరాము. కొద్ది సేపటిలోనే నాకు ఒంట్లో అసహనంగా అనిపించింది. అది ఇంతకు ముందు తప్పుకి సైడెఫెక్టు అన్నమాట. ఎవరయినా గమనించినట్టయితే ఇప్పటికి నాలుగు కప్పుల కాఫీ, టీ సేవనం అయింది.

ఒంట్లో ఉన్న వికారాన్ని సైడుకి నెట్టి అలాగే నడక కొనసాగించాను. ఇద్దరమూ బాగానే కవరు చేసాము. కానీ నా కాఫీ ప్రభావం బాగానే చూపుతోంది. మాటి మాటికీ ఆయాసంతో, వికారంతో ఆగాల్సి వస్తోంది.

అయినా అలాగే పైకెక్కుతూ ఉన్నాను. ఇక కొండ పైభాగం వచ్చేసింది అనిపించింది. అంతలోనే ఇంకా ముప్పావు భాగం దాగుందని తెలిసింది. ఇక నా వల్ల కాదని చెప్పి మా వాడిని ముందుకి సాగమన్నాను. నేనిక్కడే కొండరాయి కింద రెస్టు తీసుకుంటా నువ్వెళ్ళిరా అన్నాను. ఇన్నాళ్ళ నా ట్రెక్కులో పూర్తి చెయ్యలేకపోవడం ఇదే మొదటిసారి. సరే మన ఆరోగ్యానికన్నానా అని అక్కడే కూర్చుని ఒక చిన్న కునుకేసాను. లేచి వాడు తెచ్చిన బిస్కెట్లు తిన్నాను (NutriChoice 5 Grain). చాలా నీళ్ళు తాగాను.

ఒక పది నిముషాలలో ఇందాకటి వికారం పోయింది. మరో ఐదు నిముషాలలో నాకూ పైకి వెళ్ళాలనిపించింది. మా వాడు కొండని ఎక్కి ఒక ఇరవై ఐదు నిముషాలలో వెనక్కొచ్చాడు. నేను నీరసంగా సోలి ఉంటాననుకున్న వాడికి నేనూ వెళ్ళొస్తాననేసరికి మతిపోయింది.

ఓటమిని అంత త్వరగా జీర్ణించుకోలేను నేను. అందుకే ఏదయితే అయిందని మళ్ళీ ఎక్కడం మొదలుపెట్టాను. చిత్రంగా చకచకా ఎక్కగలిగాను. ఎన్నో అందమయిన అనుభవాలను దారిలో సొంతం చేసుకున్నాను.

దారిలో కొన్ని ఫోటోలు

Picture 053 Picture 069Picture 075Picture 054

పది నిముషాలలో కొడ పై అంచున నిలబడ్డాను. ఆ నిముషంలో ఆనందం మాత్రం చెప్పలేనిది.

ఒక ఐదు నిముషాలు అక్కడ గడిపిన తరువాత కిందికి వచ్చాను. ఇద్దరికీ భలే సంతోషం ఎలాగయితే హైకింగు పూర్తిగా చెయ్యగలిగామని. ఆ నిముషంలో నా ఆనందం ఇదుగో :-)

Moi... super charged after the conquest

మొత్తానికి నా నుండి గుణపాఠంతో కూడి ట్రెక్కింగ్ చేయలనుకునే ఔత్సాహికులకి ఈ కింది ఉచిత సలహాలు:
  • మీ డయట్‌ని ట్రెక్కింగు రోజు సరి చూసుకోండి. ఎక్కువగా ఎసిడిటీని కలిగించేవి, నూనె ఎక్కువగా ఉండేవి అతిగా తీసుకోవద్దు.
  • ఆహారాన్ని మితంగా తీసుకోవాలి, నీళ్ళు జ్యూసులు లాంటి పదార్థాలు ఎక్కువగా సేవించాలి.
  • స్టామినాని సరిగా అంచనా వేసుకోవాలి. (ఒక ట్రెక్కుని చెయ్యలేకపోవడం/పూర్తి చెయ్యలేకపోవడం అవమానం కాదు)
  • సాధ్యమయినంతగా శరీర శ్రమ సరిపోయేలా చూసుకోవాలి. ఉదా: మాలాగా బైకు మీద వెళ్ళకుండా బస్సులోనో, ట్రెయినులోనో వెళ్ళవచ్చు. వాటిలో ఈ మజా ఉండదనుకోండి.
  • ట్రెక్కు చేసేటప్పుడు ముఖ్యమయినవి రెండు విషయాలు. మొదటిది ఊపిరి తీసుకోవడం, రెండోది నడక. రెండింటికీ సరయిన లయ ఉండాలి.
ಈಗ ಸುಂದರ ಕರ್ಣಾಟಕದಲ್ಲಿ ಹ್ಯಾಪೀ ಟ್ರೆಕ್ಕಿಂಗು ಮಾಡಿರಿ.... :-)

13 comments:

కొత్త పాళీ said...

excellent.

రమణ / Ramana said...

Nice post and pics.

చిలమకూరు విజయమోహన్ said...

పవనసుతుని స్పూర్థితో అవలీలగా కాకపోయినా,కొంచెం కష్టంతోనైనా సాధించారుగా congrats

చదువరి said...

బాగుంది. అలా ట్రెక్కింగు చేసొచ్చి, ఇలా బ్లాగేసారే! బ్లాగదగిన ట్రెక్కింగులాంటిదొకటి ఈ రెండ్రోజుల్లో నేనూ చేసాను. మీ స్ఫూర్తితో బ్లాగాలి.

వేణూ శ్రీకాంత్ said...

Wonderful.

రవి said...

మధుగిరి వరకు వెళ్ళొచ్చారు, అలాగే కాస్త ముందుకెళ్ళి పావగడ శనీశ్వర స్వామిని దర్శించలేకపోయారా? అలాగే మా రాయలసీమ ఊటీ మడకశిర మిస్ చేశారే?

మధుగిరి భలే ఊరండి. నేను దాదాపు 2 నెలలకోసారయినా ఆ వూరిమీదుగా వస్తుంటాను. ఆ కొండ, కొండమీద కోటా చూస్తే భలే ఉంటుంది. అన్నట్టు బస్టాండ్ దగ్గర శతాబ్దాల నాటి శివుని గుడి ఉంది చూశారా?

ఆ హనుమాన్ విగ్రహం నెలమంగళ లో ఉన్నది కదూ. బావుంది ఫోటోగ్రఫీ.

చైతన్య.ఎస్ said...

మేము చాలా సార్లు అనుకొని వెళ్ళలేకపోయాం :(

ఈ సారి ఈ సారి ఎలాగైన వెళ్ళాల్సిందే..

ప్రవీణ్ గార్లపాటి said...

@ కొత్తపాళీ, రమణ, వేణు:
కృతజ్ఞతలు

@విజయమోహన్:
నిజం. పవనపుత్రుడి చలవే :-)

@చదువరి:
వెయిటింగు. వెంటనే టపాయించండి.

@రవి:
లేదండీ, ఆ కొండా, కోటా, శివుని గుడి తప్ప ఇంకేమీ చూడడానికి కుదరలేదు.
అవును మీకు వివరాలన్నీ భలే తెలుసే :-)

@చైతన్య:
వెళ్ళండి. పరిసరాలు ఆస్వాదిస్తూ వెళితే బాగుంటుంది.
ట్రెక్కు కొద్దిగా కష్టతరమే ఫిట్‌గా ఉంటే చెయ్యవచ్చు. ఒక మూడు గంటలు పడుతుంది ఎక్కి దిగడానికి.

రానారె said...

సూపరు. చెట్టుఫోటోలో చెట్టును చూడగానే కోక్ ప్రకటన గుర్తొచ్చింది. చెట్టుదగ్గర క్రికెట్ ఆడే పిల్లలదగ్గరికి సచిన్ వస్తాడే, అది. ఆనందం ఫోటో నిజంగా ఆనందం కలిగించింది. ఉచిత సలహాలు చెప్పావు బాగున్నాయి, నేనూ ఒకటి చెప్తా: రోజూ కాస్త కాళ్లూ చేతులూ మెడా నడుమూ పదినిముషాలైనా కదిలిస్తూ వుంటే ట్రెకింగులాంటి సుమారైన శ్రమ చెయ్యడానికి శరీరం సిద్ధంగా వుంటుందని.

శ్రీ said...

భలే ఉందండీ మీ ట్రెక్కింగు విశేషాలు.పల్సార్ మీద జూం జాం అని తిరుగుతున్నారనమట.

Naveen Garla said...

ఫోటోలు చాలా బాగా వచ్చాయ్.
NJoy

చక్రవర్తి said...

మీ ఫొటోలు చాలా బాగుంటున్నాయ్.. ఏమైనా ఫొటోగ్రఫీ ట్రైనింగ్ చేసారా.. ఏ కెమేరా వాడుతున్నారు? వివరాలు తెలియ జేయగలరు

ప్రవీణ్ గార్లపాటి said...

@రానారె: నిజమే, రోజూ చిన్న చిన్న ఎక్సర్‌సైజుల వంటివి చెయ్యాలి కానీ .... :-)

@శ్రీ: అంతే మరి

@నవీన్: థాంకూ

@చక్రవర్తి: థాంక్స్.
లేదండీ ట్రైనింగ్ ఏమీ చెయ్యలేదు. ఫోటోగ్రఫీలో టెక్నికాలిటీస్ నాకు తెలీవు. గట్ ఫీలింగ్ మాత్రమే.
నేను వాడేది "Canon S2 IS".