ఏఁ... "వర్షం కురిసిన రాత్రులే" ఉండాలా ? :)
అవునూ? వర్షం కురిసిన రాత్రుల్లో ఎక్కువగా హింసే ఎందుకు జరుగుతుంది ? జనాల కారెక్టర్లు బురదలో జర్రున జారుతాయా ?
ఎందుకొచ్చిన గొడవలెండి అడ్డమైన ఆలోచనలు వస్తాయి నాకు.
అన్నట్టు ఈ టపా వర్షం గురించి కాదు అని రివర్స్ స్టేట్‌మెంటు ఇస్తానని అనుకుంటున్నారా ? కాదండీ, వర్షం గురించే. తెలివి మీరిపోయాను కదూ. అంతే, రాతకోతలు తగ్గితే ఉన్న తెలివి ఇలాగే ఏడుస్తుంది.
ఉదయం (అంటే వారాంతాల్లో నాకు పదకొండు అని అర్థం) పనుండి జేపీ నగరం నుండి జయ నగరం వెళ్ళాల్సి వచ్చింది. నేను వారాంతాల్లో కడుపులో చల్ల కదలకుండా బజ్జుంటానే తప్ప అంత సులువుగా ఎక్కడికీ కదలను. నా బైకుని వాడటానికి ఎవరయినా ఎర చూపితే తప్ప.
బైకంటే నాకింత ఇష్టం కదా, ఏ జాన్ అబ్రహామ్ లాగానో, ధోనీ లాగానో అద్భుతమయిన బైకులు నా దగ్గరున్నాయనుకునేరు. అంత సీను లేదు నా దగ్గరుంది "ధక్ ధక్" బండి. నాకు మంచి నేస్తం అనుకోండి. ఎక్కువ వాడకపోయినా అలగదు. బ్యాటరీ చచ్చినా పని చేస్తుంది. దానిని మెయిన్‌టెయిన్ చెయ్యకపోయినా వర్షంలో బయటికెళతాం కాబట్టి అప్పుడే స్నానం కానిస్తుంది.
ఓహో ఎక్కడో ఉన్నాం మనం ఇంతకు ముందు. ఆ... నేను సెలవు దినాన ఎక్కడికో వెళ్ళాల్సి రావడం.
సరే తప్పేదేముందని పన్నెండింటికల్లా ఉపవాసాన్ని ఇరగ్గొట్టి ఇంటి నుండి బయలుదేరాను.
బయటికొస్తే వాతావరణం ఆహ్లాదంగా ఉంది, బాగా మబ్బుపట్టి ఎప్పుడయినా వర్షం పడేట్లు ఉంది. దాంతో నా ఉత్సాహం రెండింతలయింది.
అదంతే నాకూ వర్షానికీ ఉన్న సంబంధమే అలాంటిది. ఇద్దరినీ ఎవరూ విడదీయలేరు. వర్షం పడితే కనీసం తుంపర్లన్నా నా మీద పడాల్సిందే.
నాకు తెలుసు నేను అమ్మాయినయితే "వర్షం" సినిమాలో త్రిషతో నన్ను పోల్చేవారని. సరే మగాళ్ళలో ఆ కాటగిరీ అనుకోండి.
సరే ఇంతకీ నేనింకా బయలుదేరనే లేదు కదూ!
బైకు బయటికి తీసాను. పాపం బాటరీ డౌనయినా వెంటనే బుఱ్ బుఱ్ మంది. భలే ముద్దొచ్చింది నాకు.
ఓ రెణ్ణిమిషాలు దానిని రెచ్చగొట్టి, అదే యాక్సిలరేటరు పెంచి బయలుదేరదీసాను.
సాఫీగా సాగుతోంది ప్రయాణం. అతిశయోక్తి అనిపిస్తోంది కదూ ? బెంగుళూరులో రోడ్డు మీద ప్రయాణం సాఫీగా ఎలా సాగుతోందని. అదే మరు ఇలాంటి ఫీల్ గుడ్ టపాల్లో అలాంటి లాజిక్కు లొసుగులు వెతక్కూడదు. నిజాయితీ అయిన టపాలు కావాలంటే ఇలాంటి వ్యాసాలు చదువుకోండి.
సరే మీకోసం, గతుకుల్లో పడి నా బైకు ముందుకెళుతోంది. వెళ్ళాల్సింది మూడు నాలుగు కిలోమీటర్లే. అయితే జనాలకి తెలియందేముంది. బెంగుళూరులో మెట్రోలూ, పై నుంచి ఎగరడాలూ ఎప్పుడూ కడుతూనే ఉంటారు. ఓ మర్చిపోయా హైదరాబాదులోనూ అంతే కదా. అయినా ఈ విషయంలో మా బెంగుళూరు ఓ రెండాకులు ఎక్కువ చదివిందని నా నమ్మకం.
ఊ! ఇంతకీ సంగతేమిటంటే నే రోజూ వెళ్ళే ఫ్లై ఓవర్ గోతి పక్కన దారిని ఇవాళ మూసేసారు. దాని పక్కన సందు ఒకవైపు దారన్నమాట. కట కటా సిటీల్లో కష్టాలు ఇలా ఉంటాయన్నమాట. కళ్ళు మూసుకుని ఒక ఫర్లాంగు దూరం బైకుని ఆ ఒకవైపు దారిలో నడిపితే నా ప్రయాణం అందరికి మల్లే సజావుగా సాగి ఉండేది. అయితే అప్పుడది నేనెందుకవుతాను ?
ఛా, ఆ దారిలో సాగడం ట్రాఫిక్కు రూల్సుకి విరుద్ధం కదా అని నా మనసు అకారణంగా ఘోషించింది. ఇక దాన్ని భరించలేక బైకుని వెనక్కి తిప్పి ముందుకి వెళ్ళాను. (బాగుంది కదూ వెనక్కి తిప్పి ముందుకెళ్ళడం)
అక్కడ నుంచి నాక్కావాల్సిన స్రవంతిలో మళ్ళీ కలవాలంటే ఒక యూ టర్ను లాంటిది కొట్టాలన్నమాట, మొదటి లెఫ్టు టర్ను ఎందుకులే కొంచెం ముందుకెళ్ళి కొడదాం వెరయిటీగా అనుకున్నా (వీడెక్కడి వె... అని మీకనిపిస్తే ప్లీజ్ కీపిట్టు యువర్‌సెల్ఫ్ ఐసే)
ఆ లెఫ్టు టర్ను కొట్టకపోవడం వల్ల నాకు ఈద్ జరుపుకుంటున్న ముస్లిం సోదరులు తగిలారు. వారు భక్తితో మసీదుకి వెళుతున్నారు. గంట ఒకటి కొట్టిందని మీకు తెలిసిపోయిందన్నమాట. మీరు భలే తెలివయినవారు.
అక్కడ నుంచి ఎక్కడా లెఫ్టు టర్ను లేదు. అన్ని దారులూ మూసుకుపోయాయి. అలా నేను ముందుకు సాగిపోయానన్నమాట. సీను కట్ చేస్తే నేను బనశంకరిలో తేలాను. :)
భలే ఇది బెంగుళూరు రౌండప్ అవుతుందని అలాగే కొనసాగిస్తున్నా. అంతలో నా బైకు ఇప్పటికే టెన్షను చాలదనుకుందో ఏమిటో అన్నమో రామచంద్రా అంది. దాన్ని రిజర్వులో పెట్టి మరీ ముందుకు నడిపించా.
అక్కడ నుంచి ఎలా తేలానో మొత్తానికి జయానగరంలో తేలాను. అక్కడ పని చూసుకుని నే తిరిగి వెళ్ళడనికి సిద్ధమవుతున్నాను, అంతలోనే "ఇన్నాళ్ళగ్గుర్తొచ్చావా వానా" అని పాడే అవకాశం ఇవ్వకుండానే పిల్లులు కుక్కలు కురవడం ఆరంభించాయి. (మరీ కృత్రిమంగా ఉందా, అదంతే ఆ భాషలోని సహజ గుణం)
సాక్సులు కొనుక్కోవాలి, జుట్టు కత్తిరించుకోవాలి అనే నా గ్రాండు ప్లాన్సుని వమ్ము చేసింది.
నే ఉన్న బిల్డింగు సెల్లార్లో ఉంచుని వర్షాన్ని ఆనందంగా అనుభవిస్తున్నా, నా పక్క నిలబడి ఉంది ఒక పాప, ఏడెనిమిదేళ్ళుంటాయి. నే అప్పటికే ఆర్పీ పట్నాయక్ లాగా "వానా వానా వానా, నీలాకాశం లోనా" అని పాడుకుంటున్నా. ఆ పాపేమో చేతిలో "వీ"నో లేదా "పీఎస్పీ"నో చేతిలో ఉంటే బిజీగా ఉంది. ఓ క్షణం నా మెదడు గిర్రున తిరిగింది. అవునూ, మా ఇద్దరి రోలు రివర్సయిందేమిటా అని ?
హు! ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు ఆ విక్రమార్క మహారాజు కూడా ఇవ్వలేడు కానీ నాకే నా మీద జాలేసి కనీసం ఈ వర్షాన్ని అనుభవిద్దామని నా బైకుని తన్నా (కిక్కు కొట్టా. రవితేజ కిక్కు కాదండోయ్, అది ఎక్కితే ఇక దిగదు)
దాని ఆకలి అరుపులు నాకు వినబళ్ళా. దాన్ని అలాగే పరుగెత్తించా. నా ఆరేడు పాకెట్ల కార్గో తడుస్తుందో, నా టీ షర్టు పాడవుతుందో అనే ఆలోచనలు రాలా. పాపం వర్షం అలా ఒంటరిగా ఉందని దానికి కంపెనీ ఇవ్వడానికి బయలుదేరాను.
ఇక "ఒళ్ళంత జల్లింతే", ఒక క్షణంలోనే పై నుండి కింద దాకా తడిసాను. హహ, మీకంటే ముందే ఆలోచించా అందుకే మొబైలు ఫోను బ్యాక్ పాకెట్లో ఉంది.
బెంగుళూరు రోడ్ల మీద గంగా గోదావరులు ప్రవహిస్తున్నాయి. నా బైకు నడుం వరకూ మునిగింది, అయినా దానికి ఈత బాగా వచ్చు లెండి. దానికి బాగా తర్ఫీదునిచ్చా ఇంతకు ముందు.
ఎక్కడా జారకుండా స్టడీగా వెళుతోంది. రోడ్డు మీద జనాలు నన్ను పిచ్చివాడిని చూస్తున్నట్టు చూస్తున్నారు. "సేం టూ యూ" అన్నా.
బురద కలిసిన నీళ్ళు మీద పడుతున్నాయి, వర్షం నీళ్ళు దాన్ని శుభ్రపరుసున్నాయి. భలే కాంబినేషను కదూ!
కొన్ని హై జంపులూ, లాంగ జంపులూ అయింతర్వాత ఇల్లొచ్చిందనుకుంటున్నారా ? లేదు రెడ్ లైటొచ్చింది.
అక్కడ బండాగితే ఇక స్టార్టవ్వదని నాకు తెలుసు. అందుకనే దాన్నలాగే మూలగనిచ్చి నా హెల్మెట్ తీసాను. పాపం ఒంట్లో ఆ ఒక్క భాగం మాత్రం ఎందుకు తడవకూడదని.
అలా సప్త సముద్రాలూ ఈది మా అపార్టుమెంటు చేరుకున్నా. వచ్చేటప్పుడు దారెందుకు తప్పలేదని మీకు డౌటొచ్చిందా ?
వెళ్ళేటప్పుడు ఒకవైపయితే, వచ్చేటప్పుడు సరిపోతుంది కదా, మీవి మట్టిబుర్రలన్నమాట. :-) నాది ఇప్పుడే వర్షంలో శుభ్రమయింది లెండి.
ఇంటికొచ్చి భోంచేసి కుంభకర్ణుడి వారసత్వాన్ని మళ్ళీ తిరిగి పుచ్చుకున్నాలెండి.
అదీ మరి నా ఒక వర్షం కురిసిన రోజు కథ.
Tuesday, September 22, 2009
Subscribe to:
Post Comments (Atom)

6 comments:
:-) బాగుంది.
hahhahaha.. good one! :)
Hoping it would be raining posts in your blog too!
బాగుంది వర్షంలో ప్రయాణం ;)
జె.పి నగర్ టు జయ నగర్ వయా బనశంకరి !
వచ్చేప్పుడు వయ సిల్క్ బోర్డ్ రావల్సింది ఎక్కువ సేపు తడిసే అవకాశం దొరికేది
బెంగళూరులో పిన్ కోడ్ వర్షాలే కదా. జయానగరం, జేపీ, బన శంకరి అన్నీ వర్షంలో కవరయ్యాయా? మొన్న ఏదో పనుండి కోరమంగళకెళితే, అక్కడ కుండపోత. తిరిగి దోమలూరుకొస్తే, వర్షం లేదు!
"నేను అమ్మాయినయితే "వర్షం" సినిమాలో త్రిషతో .."
వేరీజ్ లేడీ ప్రభాస్ ? :-)
@వేణు: థాంక్స్.
@పూర్ణిమ:
రెయినింగా ? ఊ...
@చైతన్య:
హహ... ఈ సారి మిమ్మల్ని తోడు తీసుకువెళతాలెండి.
@రవి:
బెంగుళూరులో అది సాధారణమే...
లేడీ ప్రభాసా, హహహ. కొద్దిగా వెతికిపెడుదురూ :-)
వర్షం కురిసిన రాత్రుల్లో జరిగేది హింసా?
అబ్జెక్షన్ 'యువ'రానర్!!!
ఇది కోర్టును తప్పుదోవ పట్టించడమే.
హింస అనే పదాన్ని ఉపసంహరించాలి.
Post a Comment