కాపీరైట్ల గురించి ఎంతో మందికి ఎన్నో అపోహలు ఉన్నాయి. కొంత మందికి కాపీరైట్లంటేనే అసహ్యం, ఏవగింపు. మరికొంత మందికి, కంపెనీలకీ అదే జీవనాధారం.
ఒక కళాకారుడికి తన పనితనాన్ని కాపాడుకోవాలన్నా, కొత్తగా సృష్టించిన ఒక సాఫ్టువేరుని కానీ ఒక ఆలోచనని కానీ కాపాడుకోవాలన్నా కాపీరైట్లు, లైసెన్సులూ ఉపయోగపడతాయి. ఉదా: సంగీతం, చిత్రలేఖనం, ఫోటోగ్రఫీ, సాఫ్టువేరు, సినిమాలు, రచనలు ఇలా వేటికయినా ఈ కాపీరైట్లని ఆపాదించవచ్చు.

కొన్ని సందర్భాలని చూద్దాము.
మీరు ఒక గాయకుడనుకోండి, మీ ఆల్బముని ఎవరూ నకలు పరచకుండా కాపాడదలచుకుంటే దానికి కాపీరైట్లని ఆపాదించవచ్చు. అయితే మీ ఒప్పందాలని బట్టి దానికి సంబంధించిన కాపీరైట్లని ఒక సంగీత కంపనీకి అమ్మనూ వచ్చు. అలా మీ సొంత నైపుణ్యం అయిన కళని కాపాడుకోవచ్చు.

అలాగే మీరు ఒక ఫోటోగ్రఫర్ అనుకోండి. మీ ఫోటోలను ఎవరయినా నకలు చేసి, దానిని మార్చి వాడుకోవడం చాలా సులువు. అసలు డిజిటల్‍గా ఉన్న ఏ వస్తువునయినా సులభంగా నకలు పరచవచ్చు. దానిని కాపాడుకోవడం చాలా కష్టం. మీ ఫోటోలకు మీకు కావలసిన విధంగా కాపీరైట్లని ఆపాదించవచ్చు. ఎక్కువగా ఫోటోలకు "క్రియేటీవ్ కామన్స్" లైసెన్సింగు పద్ధతిని ఉపయోగిస్తారు. దానిని ఉపయోగించి మీ ఫోటోలను ఎవరు ఏ విధంగా వాడుకోవచ్చో చెప్పవచ్చన్నమాట.

"క్రియేటీవ్ కామన్స్" నాలుగు షరతుల మీద ఆధారపడి ఉంటుంది. Attribution, Share-alike, No-derivatives, Non-commercial

Attribution: మీ పనిని ఎవరయినా వాడుకుంటే దానికి మీ పేరు ఆపాదించాలా ? అనేది ఈ "Attribution". ఉదా: ఎవరయినా మీరు తీసిన ఒక ఫోటోని వాళ్ళ పత్రికలో వాడుకున్నారనుకోండి, మీ లైసెన్సు గనక "Attribution" చెయ్యాలి అని చెబితే వాళ్ళ పత్రికలో మీ పేరుని, మీ ఫోటో లంకెని వారు వెయ్యాలన్నమాట.

Share-alike: ఎవరయినా మీ పనిని వాడుకుంటే, దేనికయితే మీ పనిని వాడుకున్నారో ఆ పనిని కూడా మీ లైసెన్సుతోనే ఉంచాల్సి వస్తుంది అనేది ఈ "Share-alike" సారాంశం.

No-derivatives: మీరు ఒక చిన్న జింగిల్ లేదా ఒక పాట కంపోజ్ చేసారనుకోండి దానిని ఉన్నదున్నట్టుగా వాడుకోవచ్చా ? లేదా దానిని కావలసినట్టుగా మార్చవచ్చా ? అనేది "No-derivatives" చెబుతుంది.

Non-commercial: మీ పనిని కమర్షియల్ అంటే డబ్బు సంపాదించడం వగయిరా కోసం వాడుకోవచ్చా లేదా అనేది ఈ "Non-commercial" చెబుతుంది.


పై నాలుగు షరతుల కాంబినేషన్ల మీద ఆధారపడిన ఒక క్రియేటీవ్ కామన్స్ లైసెన్సుని మీరు మీకు తగినట్టు సృష్టించుకోవచ్చు. మీ పనితనానికి ఆపాదించుకోవచ్చు. ఉదా: మీ బ్లాగు కంటెంటుని మీరు "Attribution, No-derivatives, Non-commercial" అని లైసెన్సు చెయ్యవచ్చు. దానివల్ల మీ టపాలు ఎవరయినా వాడితే మీకు లంకె వేయాల్సి ఉంటుంది, వాటిని డబ్బు కోసం వినియోగించుకోలేరు, మీ టపాలను మార్చి వాడుకోలేరు.

అలా మీ పనితనానికి లైసెన్సు ఆపాదించుకోవాలంటే మీరు ఈ లంకె నుంచి మీకు కావలసిన లైసెన్సుని ఎంపిక చేసుకోవచ్చు.

ఈ కాపీరైట్ల మీద, లైసెన్సుల మీద చర్చలు ఆన్నీ ఇన్నీ కావు. కొందరు, కొన్ని కార్పొరేట్లు వీటిని సమర్థిస్తే మరికొన్ని వీటికి వ్యతిరేకం. ఇవి సృజనాత్మకతని దెబ్బ తీస్తాయని, మంచి పనితనాన్ని అభివృద్ధి పరచలేకుండా ఆపుతాయని కొందరి వాదన.

అయితే ఇందులో ఉండే చిక్కులు ఇందులో ఉండనే ఉన్నాయి. మనం నివసించే ప్రదేశాన్ని బట్టీ, మనం ఆపాదించిన లైసెన్సుని బట్టీ,వివిధ రకాలుగా ఈ కాపీరైట్లు మారిపోతుంటాయి. వాటి వాలిడిటీ కూడా ప్రదేశాన్ని బట్టి మారవచ్చు. కొన్ని న్యాయస్థానాలు వీటిని సరిగా గుర్తించవు, కొన్ని చాలా సీరియస్సుగా వీటిని గుర్తిస్తాయి.

ఏది ఎలా ఉన్నా, మన సొంత అభిప్రాయాలు ఎలా ఉన్నా కాపీరైట్ల గురించి తెలుసుకుని ఉండడం మంచిది. కొన్నిసార్లు అవసరం కూడాను.

ఈ క్రియేటీవ్ కామన్సు ఒక ఎత్తయితే ఓపెన్ సోర్స్ లైసెన్సులు ఇంకో ఎత్తు. అసలు ఓపెన్ సోర్సు ఫిలాసఫీ ఏమిటంటే మనం వ్రాసే, ఉపయోగించే సోర్సు కోడుని ఓపెన్ గా అందరికీ అందుబాటులో ఉంచాలి. నేను ఇంతకు ముందు వ్రాసిన టపాలో దీని మీద కొంత సమాచారం లభించవచ్చు.

ఓపెన్ సోర్సు లైసెన్సు ప్రోగ్రెసీవ్ డెవెలప్‍మెంటుకి ఉపయోగపడుతుందనేది నిస్సందేహంగా నిజం. దానికి అత్యంత పెద్ద నిదర్శనం లినక్స్. ఏళ్ళ తరబడి "చాలా మేరకు" ఉచితంగా ఎంతో నిలకడయిన ఒక ఆపరేటింగ్ సిస్టంని జనాలకు అందించడానికి ఈ ఓపెన్ సోర్సు లైసెన్సుల ఉపయోగం ఎంతయినా ఉంది.
విండోసుకి సంబంధించి అధికారికంగా కంపనీ వారు అందించిన ఏపీఐలు, సిస్టం కాల్సూ వగయిరా మాత్రమే వాడుకోగలిగిన డెవెలపర్లు లినక్సు మీద వారికి కావలసినట్టుగా కోడుని తిరగ వ్రాసుకోవచ్చు, మార్చుకోవచ్చు, వాడుకోవచ్చు. వారికి ఆ స్వేచ్ఛను ఓపెన్ సోర్సు లైసెన్సులు కల్పిస్తాయి.

అందుకే కాపీరైటుకి "Tongue in cheek" గా కాపీలెఫ్టు అని అంటారు ఈ లైసెన్సులని. దీనిని రిచర్డ్ స్టాల్‍మన్ వంటి వారు బాగా ప్రచారం చేసారు జీఎన్‍యూ జీపీఎల్ వంటి లైసెన్సుల సహాయంతో.

ఓపెన్ సోర్సు లైసెన్సులలో ఎన్నో రకాలు మళ్ళీ. జీపీఎల్, ఎల్‍జీపీఎల్, ఎమ్‍ఐటీ, మోజిల్లా, బీఎస్‍డీ, అపాచీ, ఎక్లిప్స్ వగయిరా. మళ్ళీ జీపీఎల్ లోనే ౧,౨,౩ వర్షన్లు. వీటిలో ఎన్నో తేడాలు. చాలా అయోమయంగా, తికమకగా ఉంటుంది తెలీని వారికి. ఒక్కొక్క లైసెన్సూ ఒక్కొక్క రకంగా మీ పనితనాన్ని వాడుకోగలిగేలా ఉంచుతాయి.
ఇందులో స్థూలంగా రెండు రకాలుంటాయి వీక్, స్ట్రాంగ్ కాపీలెఫ్టు (రెస్ట్రిక్టీవ్, నాన్ రెస్ట్రిక్టీవ్)

వీక్, స్ట్రాంగ్ కాపీలెఫ్టు లైసెన్సుల సృష్టికి కారణాలున్నాయి. స్ట్రాంగ్ కాపీలెఫ్టు అంటే మీరు ఆ లైసెన్సు ఆపాదించబడిన సాఫ్టువేరుని కానీ సోర్సు కోడుని కానీ వాడి మీ సాఫ్టువేరుని సృష్టిస్తే ఆ సృష్టించిన సాఫ్టువేరుకి కూడా ఆ లైసెన్సే ఆపాదించాలి.
దీనికి ప్రముఖ ఉదాహరణ జీపీఎల్ లైసెన్సు. జీపీఎల్ లైసెన్సు ఆపాదించబడిన ఏ సాఫ్టువేరు మీరు వాడినా మీ సాఫ్టువేరుని అదే జీపీఎల్ లైసెన్సుతో విడుదల చేయాలి.
అలా ఎందుకంటే జనాలు ఓపెన్ సోర్సు సాఫ్టువేరుని కేవలం వాడుకుని వదిలెయ్యకుండా చెయ్యడం కోసం. ఇలా నిర్బంధించలేదనుకోండి మీరు ఒక ఓపెన్ సోర్సు సాఫ్టువేరుని తీసుకుని, దానిని మీకు కావలసినట్టుగా మార్చేసుకుని అభివృద్ధి పరచి ఇతరులకు ఉపయోగపడకుండా ఇంకేదో రెస్ట్రిక్టీవ్ లైసెన్సు ఆపాదించవచ్చు. మరి అలా చేస్తే ఆ సాఫ్టువేరు అభివృద్ధి అక్కడితో ఆగిపోతుంది కదా ?
అలాంటి సందర్భాలని నిరోధించడానికే ఈ స్ట్రాంగ్ కాపీలెఫ్టు లైసెన్సులు. లినక్స్ వంటి అతి పెద్ద ఓపెన్ సోర్సు సాఫ్టువేరులు జీపీఎల్ వంటి స్ట్రాంగ్ కాపీలెఫ్టు లైసెన్సులని వాడతాయి ఎక్కువగా.

కానీ ఇలాంటి స్ట్రాంగ్ కాపీలెఫ్టు లైసెన్సుల వల్ల ఏదయినా సాఫ్టువేరుని కమర్షియలైజు చెయ్యడం కష్టమయిపోతుంది. అలాగే జనాలు ఈ లైసెన్సు ఉన్న సాఫ్టువేరుని వాడడానికి జంకవచ్చు. అందుకే వీక్ కాపీలెఫ్టు లైసెన్సులని ఇంకో రకం ఉన్నాయి. ఇవి వాటి పేరు చెప్పినట్టే ఆట్టే నిర్బంధాలు ఉంచవు.
ఉదా: బీఎస్‍డీ, ఎమ్‍ఐటీ వంటివి.
పై లైసెన్సులు వాడిన సాఫ్టువేరుని ఉపయోగిస్తే కమర్షియలైజు చెయ్యడానికీ, మీరు ఆ సాఫ్టువేరుని వాడుకోవడానికీ వెసులుబాటు ఉంటుంది. మీ సోర్సు కోడుని అన్ని సార్లూ విడుదల చెయ్యనవసరం లేకుండా ఈ లైసెన్సు ఉన్న ఓపెన్ సోర్సు సాఫ్టువేర్లని వాడుకోవచ్చు.
అలాగే జీపీఎల్ వంటి వాటికీ వీక్ కాపీలెఫ్టు లైసెన్సులు ఉన్నాయి. ఉదా: ఎల్‍జీపీఎల్.


వీటన్నిటినీ అర్థం చేసుకోవడం కష్టమయినప్పటికీ మనం ఈ లైసెన్సుల వాడుకలో జాగురూకతతో వ్యవహరించాలి లేకపోతే కష్టాలు తప్పవు. వీటిని వయోలేట్ చేస్తే కోర్టుల ద్వారా మన మీద కేసులు వెయ్యచ్చు కూడా. ఇప్పటికే ఎన్నో పెద్ద పెద్ద కార్పొరేట్లు ఈ లైసెన్సు వయోలేషన్లతో సతమతమవుతున్నాయి.

అదీ కాపీరైటు, లెఫ్టు కథా కమామీషు. ఒక్క టపాతోనో, వ్యాసంతోనో వీటి గురించిన సంపూర్తి సమాచారం అందిచటం కష్టం. అయితే కొంత వరకయినా వీటి గురించి జనాలకి తెలియాలి, వాటిని గౌరవించాలి. కాబట్టి ఇదో మొదలు. :-)

6 comments:

Indian Minerva said...

Thank you for the info.

వేణూ శ్రీకాంత్ said...

Thanks for nice information Praveen.

చైతన్య said...

Thanks for the information!

Sai Charan said...

Thank you, Praveen. I always learn something new from you!

ప్రవీణ్ గార్లపాటి said...

@Indian Minerva, @వేణూ శ్రీకాంత్, @చైతన్య, @Sai Charan:

టపా మీకు ఉపయోగపడినందుకు సంతోషం.

shanthi said...

good info ..

keep going bro !!