ఓ పేద్ద ధనవంతుడున్నాడు. ఎంతో సాధించాడు, వ్యాపారంలో ఎన్నో లాభాలు గడించాడు. అయినా వెలితి. ఒక రోజు ఒక తన నౌకరు డబ్బులు లేకపోయినా సరే ఆనందంగా ఉండడం గమనించాడు. తను జీవితంలో కోల్పోయినదేమిటో తెలుసుకున్నాడు.

ఒక ఎన్నారై ఉన్నాడు, ఓ అమెరికాలో తెగ కష్టాలు అనుభవించాడు. మానవ సంబంధాలు, కుటుంబ సంబంధాలు అన్నిటికీ దూరంగా, మాతృదేశానికి దూరంగా నిస్సారమయిన జీవితం గడుపుతున్నాడు. ఎవరో వచ్చి చెంప ఛెళ్ళుమనిపించేలా అతనికి బుద్ధి చెప్పారు.

ఒక అబ్బాయి ఉన్నాడు. ఒక అమ్మాయిని ప్రేమించాడు. పెళ్ళి చేసుకోవడం కుదరలేదు. జీవితంలో ఎంతో ఎదిగాక ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకుని సుఖపడలేకపోయినందుకు పశ్చాత్తాప పడ్డాడు.


క్రితం టపాలో లాగా ఇందులో ట్విస్టులేమీ లేవు. పై వన్నీ మనం మామూలుగా కథలలో చూసే క్లిషేలు.

అదేమిటో గానీ చాలా మంది కథకులు రొడ్డ కొట్టుడు లాగా ఒకలాగే ఉంటేనే సంతోషకరమయిన జీవితం లభిస్తుందనీ, ఇదే సరయిన మార్గమనీ ఫిక్సయిపోతారు. అలా కాని వారి జీవితాలన్నీ వ్యర్థాలు అన్నది వారి కథలలో కనిపిస్తుంది.
ఎంత బుఱ్ఱ బద్దలు కొట్టుకున్నా దాంట్లో లాజిక్కేమిటో నాకు మాత్రం అర్థం కాదు.

ఉదా: ఒక మనిషి బాగా ధనవంతుడయితే అతనికి విలువలు తెలీవా ? పేదవాడయితే మాత్రమే అతనికి విలువలు, బంధాలు తెలుస్తాయా ?
ఈ వాదనకి మూలమేమిటో అర్థం కాదు. డబ్బు మాత్రమే ఒక మనిషిని పూర్తిగా అదుపులో ఉంచుతుందా ? అయితే మరి పేద వాళ్ళందరూ ఉదాత్త హృదయులయి ఉండాలి కదా! మరి అలా లేదే. వారూ తాగుతారు, తందనాలాడతారు, భార్యల్ని కొడతారు, జులాయిగా తిరుగుతారు, జూదమాడతారు.

మరి కథల్లో మాత్రం పేదవాడెప్పుడూ ధనవంతుడికి నీతి బోధించడానికే ఉంటాడు.


కథలలో బాగా నలిగిన ఇంకో వృత్తాంతం ఎన్నారైల జీవితం. (నిజాయితీగా చెప్పాలంటే నేనూ ఎన్నారైలకి కొంత వ్యతిరేకినే) అసలు ఎన్నారైలు అంటేనే అదో రకమయిన డబ్బు కోసం వెంపర్లాడే, అనుబంధాలు లెక్కచేయని మనిషిగా చిత్రీకరించడంలో కథల పాత్ర ఉందని నా అభిప్రాయం. అన్నీ కాకపోయినా చాలా శాతం మేరకు కథలలో ఎన్నారైలు విలన్లే.

వారికి డబ్బు తప్ప ఇంకెవరూ పట్టరు. కుటుంబాలంటే లెక్క ఉండదు. తల్లిదండ్రుల గురించి పట్టించుకోరు. అకస్మాత్తుగా సంభవించే సంఘటనలతో వారికి మాతృదేశమంటే ప్రేమ పొంగుకొస్తుంది. తల్లిదండ్రులని ఎంత బాధ పెట్టారో వారి చివరి రోజులలోనో, వారి పిల్లలు వారిని సరిగా చూడనప్పుడో గుర్తుకొస్తుంది కథలలో.

ఈ కథలని చదవగానే ఆహా, ఓహోలు. ఎంత చక్కగా బంధాలని చిత్రీకరించారో ? నిజంగానే ఆ దేశాలలో ఉన్నవారు ఇవన్నీ కోల్పోతున్నారు కదూ అని.
మరి నిజాల్ని గమనిస్తే భారతంలో ఉన్నవారు ఎంత మంది మాత్రం అలా కాకుండా ఉండగలుగుతున్నారు. ఆయా అనుభవాలు కేవలం ఎన్నారైలకే ఎందుకు పరిమితం. వారు అనుబంధాలను ఆస్వాదించరా ?
కానీ కథలు మాత్రం అలాగే.


ఇక ఇంకో రకం. ప్రేమ, పెళ్ళి విఫలం కథలు. నిజానికి నాకు ఈ టపా వ్రాయాలని ఆలోచన కలిగింది మురళి గారు ఈ నాన్ జడ్జిమెంటల్ కథ (కథలో ఆల్రడీ జడ్జిమెంటు పాస్ చేసేసారని నాకనిపించింది) చదివిన తరువాతే.
ఇది నా విశ్లేషణ మాత్రమే. మనిషికి యాంబిషన్ ఉండడం తప్పు కాదే ? జీవితంలో సాధించాలనుకున్నది సాధించడమూ తప్పు కాదు. ప్రేమించిన అమ్మాయిని కట్టు దిట్టాల వల్ల పెళ్ళి చేసుకోలేకపోవడమూ అతని తప్పు కాదు.
చక్కగా మంచి జీవితమూ సాధించుకున్నాడు, డబ్బు సంపాదించుకున్నాడు. చక్కని భార్య కుదిరింది. కానీ ఎప్పుడో ఏదో పెళ్ళిలో ఇంతకు ముందు ప్రేమించిన అమ్మాయిని చూసి నేను అంత ఆనందంగా లేనే అని బాధపడిపోయి మార్పు కోరుకున్నాడు.

ఇక్కడ నాకు అర్థం కాని విషయమేమిటంటే‌ ఆనందాన్ని రచయితలు ఒక్క కోణంలో మాత్రమే ఎందుకు చూస్తారో ? నాకు ఆనందం కలిగించేది ఇంకొకళ్ళకి కలిగించకపోవచ్చుగా. అలా పల్లెటూరులో పచ్చని పంటపొలాల మధ్య తిరుగుతూ, చెరువు గట్ల మీద ఆడుకుంటూ, స్వచ్ఛమయిన గాలిని, మనసులని ఆస్వాదిస్తుండడం మాత్రమే అందరికీ ఆనందం కాకపోవచ్చు.
నగరాల్లో బ్రతుకుతూ, అపార్టుమెంటుల్లో ఉంటూ, వీకెండులలో పార్టీలు చేసుకుంటూ, విహారయాత్రలు చేస్తూ, డబ్బు ఖర్చుపెడుతూ ఆనందంగా ఉండడం కూడా చాలా మందికే సాధ్యం.
ఊహూ... కథల్లో మాత్రం వీళ్ళందరూ తెగ పశ్చాత్తాపపడిపోయి, మారిపోయి వేరే జీవితాలు కావాలని కోరుకునే వారే.

అంటే ఇక్కడ నేను చెప్పేది కథలలో విషయం ఇలా ఉండకూడదనో, నిజానికి ఇలా జరగవనో కాదు. కానీ ఎందుకని చాలా శాతం వరకూ కథల్లో ఈ భావాలే ఉంటాయో, ఎందుకని మరో వైపు కానరాదో అర్థం కాదు. కథల్లో నిజాయితీ ఉండాలా ? రియాలిటీ ఉండాలా ? అనేది చర్చా విషయం కాదు.
ఎందుకని కథలు ఎక్కువగా ఇతర కోణాలను స్పృశించవు ? అనేదే ఇక్కడ ప్రశ్న.

మరి మీకేమనిపిస్తుందో ?

18 comments:

జీడిపప్పు said...

ప్రవీణ్ గారు, సింప్లీ సింప్లీ సూపర్బ్ పోస్ట్. నేను అనుకుంటున్నవి నూటికి నూరు శాతం చెప్పారు. నిన్ననే నా బ్లాగులొ ఒక కథ గురించి చెప్తూ "చెత్త కథల గురించి ఒక పోస్టు వేస్తాను" అన్నాను. అందులో చెప్పాలనుకున్నవన్నీ మీరు చెప్పేసారు. అయినా సరే తొందర్లో నేను కూడా మరో పోస్టు వేస్తాను, మిమ్మల్ని స్పూర్తిగా తీసుకొని!

Anonymous said...

యాండోయి - అల్లా ఇతర కోణాలు సూయిత్తే సుయ్యిమని కోనార్కు ఎస్ప్రెస్సులాగా లగెత్తుకునొచ్చే వోళ్ళు శానా మంది ఉండారండి. మన కల్లూరాయన, అరిపిరాలోరు, కొత్తాళీ గోరు, మాలతి అమ్మోరు కతలు రాత్తే ఇపరీతమైన కోనాలు కనిపిత్తాయి కదోండీ. అయినా మీలాటి మారాజులకి ఇయ్యేం బుద్దులండీ - కతల్లో నిజాయితీలు, రియాల్టీలు ఎతకటం. చా, మా మాంచి తప్పు ఎగేత్తున్నారండోయి. కతల్లో పచ్చాత్తాపాలు నేపోతేనో, పేదోడు డబ్బున్నోడి మీన డవిలాగులు కొట్టకపోతేనో, ఎన్నారయిల్లో గుండెల్దీసిన బంట్లు లేపోతేనో మన గొర్రె జనాలు ఎట్టా తెర మీద సూత్తారండీ, కళ్ళతో సదూతారండీ ఇసిత్రం గాపోతేనూ. గాబట్టి మీరు ప్రశ్నలక్కనెట్టి మీక్కావలసింది సూటిగా రాసేత్తే ఇపరీతంగా సంతోసిత్తారండీ

కొత్త పాళీ said...

హ హ హ. భలే పోష్టు.
పైన యెనానిమసుల కామెంటు గూడా బెష్టు.
అద్సరే ప్రవీణ్, ఎన్నారైలు రాసుకునే కథల్లో ఎన్నారైల పాత్రలు ఎలా ఉంటాయంటారు? :)

మేధ said...

@కొత్తపాళీ గారు: ఎన్నారై లు వ్రాసే వాటిల్లో కూడా, కొంచెం విలనీనే ఉంచుతారు కాకపోతే, మరీ అంత క్రూడ్ విలన్స్ గా ఉండరు...

అరుణ పప్పు said...

ప్రవీణ్, నేననుకోవడం మీరు చెప్పిన మూస ధోరణి కథల కథకులకు సొంత ఆలోచన, ఆయా విషయాల మీద తమవైన అభిప్రాయాలు ఉండవనుకుంటా. సగటు మనస్తత్వం ఫలితం ఇది. అదే రచనల్లో, సినిమాల్లో, ఇతర కళారూపాల్లో ప్రకటమవుతూ ఉంటుంది. బలిపీఠం సినిమా చూసి కులాంతర వివాహం చేసుకున్న వాళ్లంతా చివరకు పశ్చాత్తాపపడతారని ఒక నిర్ణయానికొచ్చేస్తారు సగటు ప్రేక్షకులు. ఇటువంటిదే మీరు ప్రస్తావించిన కథకుల సంగతి. నేనెప్పుడూ ప్రేమలో పడలేదనుకోండి, అప్పుడు నాకు ప్రేమకథ నడిపించడం రాదు. అప్పుడేం చేస్తాను? సినిమాలు చూసిన, కొన్ని కథలు చదివిన అనుభవం ఉంటుంది కదా, దాన్నుపయోగించి నా కథలోని అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నట్టో, ఏడిచి పిచ్చిదైపోయినట్టో, లేదా ఇటీవలి వార్తల్ని చూస్తుంటాను కనుక యాసిడ్ పోసినట్టో రాసేస్తాను అన్నమాట. :) మరోకోణం తామనుభవించని వాటిపట్ల కుళ్లు. అంటే విమానమెక్కి అమెరికా వెళ్లి అక్కడి జీవితపు సౌఖ్య కోణాన్ని నేనెప్పుడూ చూళ్లేదు. వాళ్లూవీళ్లూ చెప్పినవి వింటాను. రోడ్లు బావుంటాయనీ, అవినీతి దైనందిన జీవితాన్ని ప్రభావితం చెయ్యదనీ.. ఇటువంటివి విని అసూయగా ఉంటుంది గదా, దాన్ని కప్పెట్టుకోవడానికి ువాళ్లంతా బంధాలను పట్టించుకోని వాళ్లని రాసేస్తా అన్నమాట. అర్థం చేసుకోరూ...

సత్యప్రసాద్ అరిపిరాల said...

ప్రవీణ్‌గారు,

గత కొంతకాలంగా నా మనసులోనూ ఇదే ప్రశ్న నలుగుతోంది. మీరు చెప్పినట్టు అది క్లిషే మాత్రమేకాదు, మూస కూడా. ఇలాంటి మూసల్లో కథ వ్రాయటం చాలా సులభం. పాఠకుడు మనం చెప్పే లైన్లోనే ఆలోచిస్తాడు కాబట్టి కథ చివరిదాకా చదివించేస్తుంది. ఇలాంటి మూస దాటి వ్రాయాలంటే రచయితకి మంచి శిల్పం, విషయపరిజ్ఞానం అవసరం. ఇది కొంచెం అరుదైన పదార్థమే..!!

మునుపు ఇలాగే కొత్త కోణంలో ఒక కథ వ్రాస్తే (పలక బలపం బ్లాగులో) అస్సలు బాగాలేదంటూ కొంత మంది వ్యాఖ్యానించారు. బాలేదంటే అక్కడ అర్థం "నువ్వు రచయితగా ఫైల్ అయ్యావు.. నువ్వు (రాడికల్‌గా)చెప్పదల్చుకున్నది మాదాకా చేరలేదు" అని నేను అర్థం చేసుకున్నాను. మరోసారి ఇలాంటి కథ వ్రాయాలా వద్దా అని ఆలోచించాను.

అయితే అలా చెప్పి మెప్పించినవారూ లేక పోలేదు. క్రింది బ్లాగులో ప్రముఖ దిన పత్రికలో వచ్చిన కొన్ని కథలున్నాయి. అందులో - బందెలచావిడి, అనుబంధం చదవండి. మీకు కొంచెం సాంత్వన కలుగుతుంది.
http://sites.google.com/site/manchimata/inadu-adivaram-kathalu

కత్తి మహేష్ కుమార్ said...

బాగుంది. ఆలోచించాల్సిన విషయం.

సత్యసాయి కొవ్వలి said...

మంచి దృక్కోణం. సంపాదించిన వాళ్ళేమీ పెద్ద సుఖపడిపోవడం లేదని అనుకోవడంలో ఒకరకమైన సేడిజంఉందేమో.

చైతన్య said...

చాలా బాగుంది మీ పోస్ట్.
ఈ ప్రశ్నలన్నీ చాలా మంది మనసులో ఉన్నవే...
అందరు రచయితలూ ఇలా ఒకే ధోరణిలో వ్రాసుకుంటూ పోతారు కనుకనే... ఎప్పుడైనా ఎవరైనా కొంచం వేరేగా రాస్తే... మనకి ఒక different, వెరైటీ కథ చదివిన ఫీలింగ్ వస్తుంది... ఆ వెరైటీ కథ కాస్త రిలీఫ్ ఇస్తుంది :)

te.thulika said...

మంచి చర్చే.సంపాదకులు కూడా ఇలాగే భిన్నదృక్పథాలు గల రచనలని స్వీకరించాలి కదా మూసకథలు మాత్రమే చదివే గతి మనకి పట్టకుండా వుండాలంటే.
జీడిపప్ప దృష్టిలో చెత్తకథలేమిటో కూడా చూద్దాం.

Sudhakar said...

Nice thought process

Ramesh Babu said...
This post has been removed by the author.
Ramesh Babu said...

అందరికి నమస్కరం అండి. ప్రవీన్ గారి బ్లాగు కి నేను ఒక క్రొత్త పాఠకుడిని.
ఇలాంటి కధలు, సినిమాలు చాలా చూశాను, చదివాను కాని ఈ కొణం లొ ఎప్పుడు ఆలొచించ లెదండి బాబు!!
కానీ, నావి విచిత్రమైన సందెహాలు
హీరొ తుపాకి పెలిస్తె వెంటనె తగులుతుంది కాని విలన్ పెలిస్తె తగలవు ఎందుకు?
2.హీరొ తుపాకి లొ బుల్లెట్స్ ఎప్పుదు ఎందుకు ఐపొవు?
ఇలాంటి బోలెడు సందెహాలు

నాగన్న said...

కథ రాసే వారి ప్రధాన లక్ష్యాలను బట్టి కథ స్వరుపం మారుతూ ఉంటుంది అనుకుంటాను...

ఎక్కువ మంది చదవాలి అనే ప్రధాన ఉద్దేశ్యంతో మొదలుపెడితే, మెజారిటీ వర్గాల కోసం (పేదరికం, బాధలు వగైరా) రాస్తారు.
అనుభవాలు, ఊహలతో మరి కొన్ని.. మచ్చుకి ఎన్నడూ విదేశాలకు రాని వారు, లేదా వచ్చి ఓ పదిమందిని చుసి అమెరికా-అంతా-ఇంతే అని ఓ నిర్ణయానికి వచ్చిన వారు రాసే కథలు. స్లండాగ్‌లాంటి ప్రాపగాండా సినిమా కథలు... (వివరాల్లోకి వెళ్ళడం లేదు)
వగైరా వగైరా....

ప్రవీణ్ గార్లపాటి said...

@జీడిపప్పు:
మంచి టపా, విశ్లేషణ. టపా నచ్చినందుకు సంతోషం.
మీ విశ్లేషణ కోసం ఎదురు చూస్తాను.

@అనానిమస్సు:
మీర్రాసిన యాస తెగ నచ్చేసిందండోయ్.
సూటిగా సుత్తి లేకుండా వ్రాయమంటారా, సరే అలాగే :P

@కొత్త పాళీ:
ఈ మాటలో ఫస్టు హాండు ఎక్స్పీరియన్సు ఉన్న మీకు నేను చెప్పాలా ? :-)
ఎవర్రాసినా ఎన్నారైలు ఎన్నారైలే, వారి మీద చెణుకులు విసరాల్సిందే.

@మేధ:
:-)

@అరుణ గారు:
మంచి వివరణ. అయితే సొంత ఆలోచనతో రాయాల్సిన బాధ్యత కొంతయినా రచయిత మీద ఉంది.
లేకపోతే ఆ రచయితకీ కాపీ కొట్టే దర్శకులకీ తేడా ఏముంది. కాన్సెప్టు ఒకటే అయినా టేకింగు వేరు అని చెప్పుకునే బాపతే.
కొంతయినా ఒరిజినాలిటీ, సొంతంగా అనుభవించినవి వ్రాయాలి. అదీ కాక నేను గమనించిందేమిటంటే కొంత మంది రచయితలు తమ సొంత అనుభవాలు వేరుగా ఉన్నా అలా వ్రాయడానికి ఇష్టపడరు.
ఉదా: ఒక సాఫ్టువేరు ఇంజినీరు కథ వ్రాస్తున్నాడనుకోండి, తన జీవితం గురించి సాధక బాధకాలన్నీ తెలిసినా ఆ వైపుని సరిగా చూపిస్తూ వ్రాయరు.

@సత్యప్రసాద్ గారు:
చక్కని లంకెని అందించినందుకు ధన్యవాదాలు.
పాఠకులని మెప్పించడానికి కథలు వ్రాయాలా, సొంత ఆలోచనలని వ్రాసుకోవాలా అన్నది ఎవరికి వారు నిర్ణయించుకునేదే.

@మహేష్ గారు:
థాంక్యూ!

@కొవ్వలి గారు:
హహహ... ఏమో అందని ద్రాక్ష సూత్రమేమయినా నేమో ?

@చైతన్య:
ఓహో! అలాగంటారా. అందరూ వెరయిటీగా రాస్తే వెరయిటీ బోరు కొడుతుందేమో :P

@మాలతి గారు:
పైన సత్యప్రసాద్ గారన్నట్టు ఒక మూసలో వ్రాయడం సులభం. కథని తేలికగా వ్రాయవచ్చు, ముగింపునివ్వవచ్చు.
పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. అయితే భిన్నంగా ఉంటే ఆదరణ ఉండదనుకోవడం కూడా సరి కాదేమో.
మీరన్నట్టు ప్రోత్సాహం ఉంటే తప్పక మరింత మంది ఇంకెన్నో కోణాలలో వ్రాయగలరు.

@sudhakar:
ధన్యవాదాలు.

@Ramesh Babu:
దేని దరిద్రం దానిదే !

@నాగన్న:
కొంత వరకూ ఒప్పుకుంటాను.
సొంత అనుభవం లేని వారు ఒక విషయం గురించి వ్రాయకూడదని కాదు గానీ, కొంత పరిశోధన అయినా చేయాలి.
రీచబిలిటీ విషయంలో మీ అభిప్రాయమే నాదీను.

రానారె said...
This post has been removed by the author.
రానారె said...

భలే టపా!

ఏదో కథలోనే చదివాను, "మనలో చాలామందిమి మాట్లాడేటప్పుడు మన మాట ఎదుటివారిలో అసూయ రేకెత్తించకుండా జాగ్రత్తపడుతూ వుంటాం. ఎదుటివాని దగ్గర లేనిది, నీకు మాత్రమే దక్కినదీ చూపిస్తే సాధారణంగా వాడు సంతోషించడు కానీ సంతోషించినట్టు నటిస్తాడు, నిన్ను అభినందిస్తాడు" అని.

నువు ప్రస్తావించిన కథల్లో క్లిషేలకు కారణమిదే కావచ్చు. :-)

తృష్ణ said...

కొత్తపాళిగారి టపా ద్వార ఇవాళే మి బ్లాగు చుసానండి.చాలా బాగుంది.విలు చూసుకుని చదవాలి మీ పాత పోస్టులన్ని..