ముంబై పేలుళ్ళ నేపథ్యంలో నా బ్లాగులో సంతాప సూచకంగా ఏమన్నా వ్రాద్దామన్నా కుదరని మానసిక స్థితిలో ఉన్నాను నేను.
ఆలోచించీ, ఆలోచించీ పిచ్చెక్కిపోతుంది. ఎందుకు ? ఏమిటి? ఎలా ? అని ఆలోచిస్తుంటే సమాధానం లేని ప్రశ్నలే. ఇంత మందిని పొట్టన పెట్టుకున్న ఈ దుర్ఘటన కళ్ళలో నుంచి నీళ్ళు తెప్పిస్తుంది. మనసుని కలచి వేస్తుంది.
ఆఫీసుకి వెళ్ళానన్న మాటే కానీ నా మనసు పని మీద లగ్నం కానే లేదు. మళ్ళీ ఎలాంటి వార్త వినవలసి వస్తుందో, ఈ పోరు ఇంకెంత సేపు సాగుతుందో, ఇంకెంత మంది బలవుతారో అన్న ఆలోచనలు అస్సలు నన్ను మామూలుగా ఉండనివ్వలేదు.
అసలు ఇతర బాధలేవీ పట్టనంత స్థబ్దుగా ఉండిపోయారు అందరూ.
రెండు రోజుల నుంచీ ఎక్కడ చూసినా ఈ వార్తలే. పత్రికలు చదివినా, ఏ ఛానెల్ పెట్టినా ఈ దుర్ఘటన గురించిన కథనాలే. నెత్తుటి మరకలే.
ఒక వైపు ఆప్తులని పోగొట్టుకుని, అంతటి ట్రౌమా నుంచి బయటపడ్డ వ్యక్తులని కూడా వదలని మీడియాని ఆ టెర్రరిస్టులకి అప్పజెప్పాలనిపించింది. నానా ఛండాలం చేసారు వార్తా ఛానళ్ళని. సానుభూతి, అర్థం చేసుకోవడం వంటి భావాలు మచ్చుకి కూడా వీరికి లేవా అన్నంతగా దిగజారారు. దీనికి తోడుగా బుఱ్ఱలేని వ్యక్తులతో అర్థరహితమయిన వాదనలు.
ఏదో పెద్ద ఘనకార్యం చేస్తున్నట్టు మన పోలీసు, మిలిటరీ వాళ్ళ స్ట్రాటెజిక్ లొకేషన్లని లైవ్ టెలీకాస్టు చేస్తున్నారు. ఆ రోడ్డున పోతున్న కుక్కని కూడా వదలకుండా ఇంటర్వ్యూలు.
ఇంకొక బాధాకామయిన విషయం మన పోలీసు వ్యవస్థ, సంరక్షణ వ్యవస్థ ఇలాంటి పరిస్థితులకి ఎంత అధ్వాన్నంగా తయారయి ఉందో. అవును టెర్రరిస్టులు వస్తారని ఎవరూ ఊహించరు, రావాలనీ కోరుకోరు. కానీ ఈ మధ్య జరిగిన పరిస్థితుల దృష్ట్యా అయినా కొంత కూడా అప్రమత్తంగా లేరు. తయారయి లేరు. ప్రపంచంలోనే అతి పెద్ద సైన్యం ఉన్న దేశాలలో ఒకటయిన మన దేశంలో క్రైసిస్ వచ్చినప్పుడు ఎదుర్కోవాల్సిన విధానం లేదు.
ఈ వేళలో అతి తక్కువ రక్షణ కవచాలతో ముందుకి సాగుతున్న పోలీసులు, ఎన్‌ఎస్‌జీ దళాలను చూస్తుంటే వారి ధైర్యానికి తలొంచక తప్పట్లేదు. ఇందులో వీర మరణం పొందిన హేమంత్ కర్కరే, విజయ్ సలాస్కర్, కామ్టే, ఇంకా ఇతర ఎన్‌ఎస్‌జీ దళాల సభ్యులకి నివాళులర్పించుకుంటున్నాను.
ఇవన్నీ ఒక ఎత్తయితే మన రాజకీయ నాయకులు చేసే చెత్త జిత్తులు ఇంకొక ఎత్తు. అసలే అంతంత మాత్రంగా ఉన్న తాజ్ హోటలు ప్రదేశాలకి రాజకీయ నాయకులు సరదాకి విడిదికి వచ్చినట్టు వందల సెక్యూరిటీ మధ్య రావడం. అసందర్భ ప్రకటనలు చెయ్యడం. అక్కడ యుద్ధం చేస్తున్న వారికి ఆటంకంగా మారడం.
మన హోమ్ మినిస్టర్ శివరాజ్ పాటిల్ వ్యాఖ్యలు వెగటు పుట్టిస్తున్నాయి. టెర్రరిస్టులకి సంబంధించి, దాడుల గురించీ ముందే సమాచారం ఉందట. కానీ వారు సరిగ్గా ఏ ప్రదేశంలో, ఏ సమయంలో, ఏ దారిలో దాడి చేస్తున్నారో తెలీదు కాబట్టి "తూ తూ మై మై" లాంటి పరిస్థితట. ఇలాంటి వ్యాఖ్యలు వ్యక్తి మన హోమ్ మినిస్టరు.
వచ్చేసారి టెర్రరిస్టులు పాపం ఈయనకి ఒక ఫోను చేసి ఇదిగో ఇక్కడ ఇలా దాడి చెయ్యాలనుకుంటున్నా, నీకు ఓకేనా ? అని అడిగి మరీ చేస్తారేమో ?
ఇతర దేశాలు, వాల్ స్ట్రీట్ జర్నలు మన దేశాన్ని ఒక "incompetent leadership" గా వర్ణిస్తున్నాయంటే అందులో అతిశయోక్తి లేదేమో అని అనిపిస్తుంది. ఒకసారి పొరపాటు జరిగితే మనం తప్పు పట్టకపోవచ్చు. ఎన్నో సార్లు దేశానికి చెందిన ముఖ్య పట్టణాల్లో దాడులు చేసి, బాంబులు వేసి కల్లోలం సృష్టిస్తున్నా ఎలాంటి చర్యలూ తీసుకోకుండా వెధవల్లా కూర్చున్నారంటేనే తెలుస్తుంది మన రాజకీయ నాయకుల "పనితనం".
అఫ్జల్ గురు లాంటి మారణ హోమ సృష్టి కర్తలని మతం పేరిట ఉరి తీయకుండా ఆపుతున్న మన రాజకీయ తొత్తులు నిజంగా మన దురదృష్టమే.
ఇప్పటికయినా మేల్కొని సరయిన వ్యవస్థని రూపొందించుకోవడంలో ఓటు వేసి మనం, సరయిన ప్రణాళిక రూపొందించి మన ప్రభుత్వం సరయిన పాత్రలని పోషించాలి. లేకపోతే మనకి ఆఖరికి మిగిలేది ఒక రగిలే మారణ హోమమే!
Saturday, November 29, 2008
Subscribe to:
Post Comments (Atom)

7 comments:
meeru cheppindhi current kaani mana rajakeeya nayakulu nakka lanti varu ela ante adhi okuda badhapaduthudhemo. sigguleni janma unna ekyka jathi rajakeeya nayakula jathi.
మీరన్నది అక్షరసత్యం. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే..అయితే ఇటువంటి పరిస్థితులకి ప్రజలెంతవరకూ భాగస్వామ్యులు అవుతారన్నది మరొక కోణం. అంత పెద్ద పెద్ద హోటళ్ళలో ఒక చిన్న లగేజి స్కానర్ వుండి వుంటే...వందల కేజీల ఆర్డిఎక్స్, మారణాయుధాలు లోపలికి వెళ్ళి వుండేవి కాదుగా
వందేళ్ళ చరిత్ర ఉన్న ఓ పార్టీకి, ఇలాంటి హోం మినిస్టర్, ఆయన వ్యాఖ్యలు సిగ్గు చేటు. మరణించిన వారి మీద వీళ్ళకు కనీస సానుభూతి కూడా ఉందో లేదో అనుమానమే. దేవుడే రక్షించాలి మన దేశాన్ని.
వందేళ్ళ చరిత్ర ఉన్న ఓ పార్టీకి, ఇలాంటి హోం మినిస్టర్, ఆయన వ్యాఖ్యలు సిగ్గు చేటు. మరణించిన వారి మీద వీళ్ళకు కనీస సానుభూతి కూడా ఉందో లేదో అనుమానమే. దేవుడే రక్షించాలి మన దేశాన్ని.
నిజానికి నా అభిప్రాయం నా బ్లాగులోనే పోస్టుగా రాద్దామనుకున్నాను. కానీ మీ ఆవేదనలో చాలా నిజాయితీ కనపడి , ఇక ఇక్కడే రాద్దామనుకుంటున్నాను.
దాడి జరిగినన్నాళ్ళూ కలుగులో ఎలకల్లా అయిపు లేకుండా పోయిన నాయకులంతా "దాడి ముగిసింది 'అన్న ప్రకటన వెలువడ్డాక స్టేట్మెంట్లతో తయారవడాన్ని చూస్తుంటే వీళ్ళ మొహాన్న ఉమ్మెయ్యాలనిపించడం లేదూ? "మీరు మారరా?" అని పేడకళ్ళాపి మొహాన కొట్టాలనిపించడం లేదూ?
దేశ ప్రజలంతా ముంబాయికి సంఘీభావంగా నిలబడ్డ రోజిది. అయినా రాజకీయ నాయకుల తీరు మాత్రం మారదే! శివరాజ్ పాటిలు పీకలేకపోయిందేమిటి, చిదంబరం వచ్చి పీకేదేమిటి? ఎవడైతే మనకేం ఒరిగింది. అందరూ ఆ తానులో ముక్కలేగా? అందరూ రాజకీయ నాయకులేగా?
మంత్రుల్నీ, ముఖ్య మంత్రుల్నీ మార్చేస్తే పోయే సమస్యా ఇది?చిత్త శుద్ధి అన్న మాట వీళ్ళు చచ్చే లోపు ఒక్క సారైనా ఫీల్ కారా?
అసలు విలాస రావుకి సిగ్గుంటే, అతగాడు మనిషైతే రాం గోపాల్ వర్మ ను , కొడుకు రితేష్ దేశ్ ముఖ్ ని తీసుకుని తాజ్ హోటల్కెళతాడా? స్మశానాన్ని తలపిస్తూ రక్తపు మరకలతో, బలవన్మరణం పొందిన ఆత్మలతో భీభత్సంగా ఉన్న ఆ ప్రదేశానికి వెళ్ళాల్సింది సినిమా దర్శకుడితోనా? ఈ వర్మ సైకో కాకపోతే అల్లాంటప్పుడు అక్కడికెళ్ళి సినిమాకు ప్లాట్ ఆలోచిస్తాడా? మనుషులా వీళ్ళు? మనుషులా వీళ్ళు? శవాల మీద పైసలేరుకునే వాళ్ళు కూడా గతిలేని పరిస్థితుల్లో ఏరుకుంటారు. వీళ్లని పోల్చడానికి నీచమైన పోలిక కూడా దొరకడం లేదు.
తీరుబడిగా తాజ్ ముందు స్టేట్మెంట్లు ఇస్తున్న సంజయ్ నిరుపం మొహాన జనం చెప్పులు విసరడం చూసి చెప్పలేని సంతోషం కలిగింది. "దాడులు జరిగినపుడు ఎక్కడ దాక్కున్నావు, పోరా కుక్కా" అని జనం చీ కొడితే పారిపోయాడు. ఏదో సినిమా చూస్తున్నట్టు అనిపించింది.
ముంబాయి జనాన్ని రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ, అమరవీరుల కుటుంబాల త్యాగాలకు డబ్బు తో విలువ గట్టాలని చూసిన మోడీకి శ్రీమతి కర్కరే గట్టి గుణపాఠమే చెప్పింది. ఆ డబ్బు విసిరి అతని మొహానే కొట్టింది. ఒక రూపాయి చేర్చి కొడితే మరీ బాగుండేది. మనిషి పోయినపుడు డబ్బు ఇవ్వడం తప్ప ప్రాణం విలువు , త్యాగం విలువ తెలుసా వీళ్లకి? భారత దేశపు మోస్ట్ వేస్ట్ బాచెలర్ రాహుల్ ని, విలాస్ రావు కొడుకు రితేష్ ని NSG లోనో, సైన్యంలోనో చేర్చమంటే పంపుతారా? మీ కొడుకులు బిజెనెస్ మాగ్నెట్లూ, మీ వారసులుగా నాయకులూ కావాలా? ప్రజల ప్రాణాలకు మాత్రం మీరు హామీ ఇవ్వలేరు! ఇదెక్కడి న్యాయం?
ఉన్ని కృష్ణన్ తండ్రి "you stinky dogs, go away" అని కేరళ ముఖ్యమంత్రిని మెడబట్టి బయటికి గెంటుతుంటే మనసు ప్రశాంతంగా అనిపించింది.
జనం తిరగబడితే ఎలా వుంటుందో నాయకులకు ఇప్పుడే తెలిసింది.ఇంకా ఇంకా తిరగబడాలి. తరిమి తరిమి కొట్టాలి.
సగం భయాందోళనలని మీడియా చానెళ్ళు సృష్టించాయి. ఈ విషయంలో అవి పూర్తిగా సఫలమయ్యాయి.ఇంకా నయం, బాబ్రీ మసీదు కూలగొట్టే సమయంలో ఇన్ని చానెళ్ళు ఉండుంటే కెమెరాలతో మసీదు పైకెక్కి, కరసేవకులకు చాన్స్ ఇవ్వకుండా వీళ్ళే మొత్తం కూలగొట్టేవాళ్ళేమో!(అన్ని చానెళ్ళ వాళ్ళూ ఎక్కితే కూలదూ)
ప్రధానమంత్రి, హోం మంత్రుల వ్యాఖ్యలు వింటుంటే ఇలాంటి ప్రభుత్వం కింద ప్రజలుగా ఉన్నందుకు సిగ్గుతో చావాలనిపిస్తుంది. అసలు ప్రభుత్వమంటూ లేని చోటికి పారిపోవాలనిపిస్తోంది.(ఇప్పుడు ఉన్నది అక్కడేగా అంటారా)
ఓటు గురించి ఎంత చెప్పినా ప్రజల్లో సరైన అవగాహన రావడం లేదు. పార్టీని చూసో, కులాన్ని చూసో తప్ప సరైన వ్యక్తిని ఎంచుకోవడం జరగటం లేదు. అయినా ఎవరికి ఓటేస్తే ఏమిటి? అందరూ దొంగలే అయినపుడు? ఎవరికి నిజాయితీ ఉంది?
నిరాశగా ఉంది. దిగులుగా ఉంది. ఎప్పటికీ భారత రాజకీయ వ్యవస్థ మారదేమో అని భయంగా ఉంది.
@ anonymous:
నిజమే!
@ saisahiti:
ఒక రకంగా అవన్నీ తరువాత స్థాయి. ముందస్తుగా హెచ్చరికలు జారీ అయినా ఎటువంటి చర్యలూ తీసుకోకపోవడం అతి పెద్ద తప్పు.
@ రవి:
కనకపు సింహాసమున ... అదే ఇక్కడ.
@ సుజాత గారు:
మీకున్నటువంటి ఆలోచనలే నాకు కలిగాయి. కోపం, తట్టుకోలేనటువంటి కోపం.
అన్నిటికన్నా నన్ను బాధించింది నాయకులలో అసలు నిజాయితీ కనబడకపోవడం. బాధ్యత గుర్తించకపోవడం.
తప్పు వివిధ స్థాయిల్లో జరిగింది. లంచం తీసుకుని కొందరు, అజాగ్రత్తతో కొందరు, పట్టించుకోక కొందరు. అన్నీ కలిస్తే ఒక పెద్ద ఘోరం.
అన్నిటినీ రాజకీయం, అన్నిటిలోనూ స్వలాభాపేక్ష.
సుజాత గారు, మీరు చెప్పింది అక్షరాలా నిజం. వాళ్లకె చిత్తశుద్ది ఉంటె ఆక్టొపస్ విభాగాన్ని పొయిన ఆగస్టు లొ జరిగిన దాడి తరువత పూర్తి స్తాయిలొ సమీకరించి ఉండేవాళ్లు. తాజ్ సంఘటనకి రాజకీయ నాయకుల్లొ కనీసం ఒక్కరయిన కనీళ్లు కార్చారా? అంతా ఒక గాదె కింద ...లె కద
Post a Comment