అది నా చిన్నప్పుడు. హైదరాబాదులో ఉన్నాము మేము.

ఏడో క్లాసో, ఎనిమిదో క్లాసో చదువుతున్నాను నేను. మాకు "హౌండ్ ఆఫ్ బాస్కర్విల్లేస్" అనే ఒక నాన్‌ డీటెయిల్ ఉండేది. అది మొత్తం ఒక కథే. ఒక అద్భుతమయిన మిస్టరీని "షెర్లాక్ హోంస్" ఛేదిస్తాడు ఆ కథలో. అది నన్ను ఎంత ఆకట్టుకుందంటే సాధారణంగా క్లాసు పుస్తకాలంటే అంత ఆసక్తి లేని నేను ఆ నాన్ డీటెయిల్‌ను స్కూలు మొదలయిన పది రోజుల్లోనే మొత్తం చదివేసాను. ఓహో కథలు ఇంత అద్భుతంగా కూడా ఉంటాయా అని నేను "awe"లో ఉండిపోయిన కాలం.
అప్పటి వరకూ కేవలం చందమామ, బాలమిత్ర, రామాయణ మహాభారత సంగ్రహాలు మాత్రమే చదివే అలవాటున్న నాకు ఇంగ్లీషు కథలు, పుస్తకాలు చదవడం కొత్త. (అంటే రాక కాదు, చదవాలని అప్పటి దాకా తోచలేదు)

అప్పటి నుంచీ నాకు డిటెక్టీవ్ పనులంటే చాలా ఇష్టం. నేను పెద్దయ్యాక డిటెక్టీవ్ అయిపోయి సీక్రెట్టులన్నీ ఛేదించాలని కెరీర్ ప్లాను.
దానికి కృషిగా నేనే కొన్ని పజిళ్ళు సెట్ చేసి సాల్వ్ చేసేవాడిని. :-)

కొన్ని సార్లు ఇతరులకు ట్రెజర్ హంటు లాగా క్లూలతో కూడిన పజిళ్ళు ఇచ్చేవాడిని. ఓ సారి మా క్లాసులో ఒకతని బర్త్‌డే ప్రెజెంటు దాచేసి అది కనుక్కోవాలంటే క్లూలు ఇచ్చాను. సాయంత్రానికి నలుగురు కలిస్తే కానీ అది అతని చేతికి చిక్కలేదనుకోండి.

మా ఇంట్లో అప్పుడు "Complete Adventures of Sherlock Holmes" బైండు చేసిన ఒరిజినల్ ఎడిషన్ ఉండేది. ఒకరోజు అనుకోకుండా అది నా కంట బడింది. అప్పటికింకా "షెర్లాక్ హోంస్" అనే అద్భుతమయిన పాత్ర గురించీ, దాని సృష్టికర్త "సర్ అర్థర్ కానన్ డయల్" గురించీ ఎక్కువగా తెలీదు.

ఆ కథలు చదివి నేను "షెర్లాక్ హోంస్" కి పెద్ద పంకానయిపోయాను. ఆ తర్వాత కొన్నాళ్ళకు కానీ నాకు అర్థం కాలేదు, "షెర్లాక్ హోంస్" కేవలం ఒక కల్పితమయిన పాత్ర అనీ ఆ గొప్పతనమంతా అది సృష్టించగలిగిన "సర్ అర్థర్ కానన్ డయల్"దని.
మనం చాలా మటుకు ఒక పాత్రని అభిమానిస్తాం. కానీ ఒక పాత్ర ఆ విధంగా రూపుదిద్దుకోవాలంటే ఆ వెనక ఉన్న రచయిత పడే కృషి అంత త్వరగా మనకు అర్థం కాదు. అలా ఆ పాత్రలో రచయిత కాక పాత్ర మాత్రమే కనబడడంలో ఆ రచయిత ప్రజ్ఞ దాగి ఉంది.
ఇది సినిమాలకూ వర్తిస్తుంది. ఒక సినిమాలో మనం ఒక హీరోనో, హీరోయినునో పోషించిన పాత్రని అభిమానిస్తాం. అది మనకు పిచ్చి పిచ్చిగా నచ్చేస్తుంది. అందుకు ఆ పాత్ర పోషించిన నటుల పాత్ర ఉన్నా కూడా ఆ పాత్రకి జీవం పోసిన రచయితా, దర్శకుడే అసలు కారణం. అసలు వారు లేకపోతే ఆ నటుడు నటించిన పాత్రే లేదు కదా.

అలా రచనలలోని గొప్పదనం తెలియడానికి నా మొదటి మెట్టు "కానన్ డయలే". షెర్లాక్ హోంస్ పాత్ర గొప్పదనమేమిటంటే ఆ పాత్ర చేసే సిస్టమాటిక్ డిడక్షన్లు. ఒక మనిషిని చూడగానే అతని హావభావాలు, ధరించిన వస్త్రాలు, వస్తువులని గమనించి అతని గురించి ఎంతో తెలుసుకోగలడు.
అలాగే ఒక మిస్టరీ ఛేదించేందుకు సిస్టమాటిక్ అప్రోచ్ కలిగి ఉంటాడు. ఏదయినా కేసు శోధించాలంటే దానికి సంబంధించిన వివరాలను సమగ్రంగా సేకరిస్తాడు. నిజాలు అన్నీ ముందు సేకరిస్తాడు. అంత త్వరగా అభిప్రాయాలు ఏర్పరచుకోడు. చిన్న చిన్న విషయాలను సూక్ష్మంగా గమనిస్తాడు. ఎటువంటి బయాస్ లేకుండా ఆలోచించస్తాడు. దేనినీ గ్రాంటెడ్ గా తీసుకోడు.

ఉదా: "His Last Bow" సిరీసులోని "The Adventure of the Bruce-Partington Plans" చదివితే ఆ కథలోని మిస్టరీని ఛేధించే విధానం అద్భుతం.

చేసే పని పూర్తి డెడికేషనుతో చేస్తాడు.

ఉదా: పైన సిరీసులోనే "The Adventure of the Dying Detective"లో ఆ కేసు కోసం ఒక అరుదయిన వ్యాధి సోకిన వ్యక్తిలాగా నటిస్తాడు. దాని కోసం ఏమీ తినకుండా రోజుల తరబడి ఉంటాడు.

ఇవన్నీ ఆ పాత్రని స్వభావాన్ని వివరించేవే. అయినా ఇంకా అది రచయిత సృష్టే. అంటే రచయిత అలా ఆలోచించలేకపోతే ఆ పాత్ర అలా ఆలోచించలేదు.
ఇక్కడ నేను రచయిత నిజ జీవితంలో అలాంటి వ్యక్తా కాదా అన్నదాని గురించి మాట్లాడట్లేదు. రచయిత ఆ పాత్రని ఆలోచించగలిగాడా లేదా అన్నదాని గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ఒక రచయితకి ఎంతో కల్పనా శక్తి ఉండాలి. కొంత మటుకు అనుభవాల మీద కథలల్లినా చాలా సార్లు తెలీని, ఎరుగని వాటి మీద కథ చెప్పగలగాలి.
అది అంత సాధారణ విషయం కాదు. ఎందుకంటే తెలీని విషయం గురించి చెప్పేటప్పుడు కూడా సాధికారత ఉండాలి. అందుకు తగిన పరిశోధన, బ్యాక్గ్రౌండ్ వర్కు చెయ్యాలి.
అవి నాకు అత్యద్భుతంగా షెర్లాక్ హోంస్ పాత్రలో కనిపిస్తాయి.

ఇక ఇవన్నీ నాకు గుర్తుకు తెచ్చింది ఈ మధ్యే పూర్తి చేసిన "Complete Adventures of Feluda Volume I & II". నేను దాదాపు షెర్లాక్ హోంస్ తప్పితే ఇంకే ఇతర డిటెక్టీవ్ నవలలూ చదవడానికి ఇష్టపడను. ఎందుకంటే ఏవీ ఆ స్థాయిలో ఉండవు, ఉండలేవు :-)
ఇక ఫెలూదా చదవడానికి ప్రేరేపించింది డిటెక్టీవ్ దురద మళ్ళీ పుట్టడం, సౌమ్య గారి బ్లాగులో దాని గురించి చదవడం.
నేను ఎక్కువగా చదివేది వారాంతాలలోనే కాబట్టి ఒక వాల్యూమ్ ఒక వారాంతంలో ఇంకోటి మరో వారాంతంలో పూర్తి చేసాను.

ఇక క్లుప్తంగా చెప్పాలంటే సత్యజిత్ రే రాసిన ఫెలూదా పుస్తకాలు, ఇండియన్ షెర్లాక్ హోంస్ అనుకోవచ్చు. ఈ కారెక్టర్లని ఆయన షెర్లాక్ హోంస్ ప్రేరణతో సృష్టించినట్టు చెప్పుకున్నారు. అది కథలలో కనిపిస్తుంది కూడా.
చిన్న పిల్లల కోసమని ఒక పత్రికలో ఆయన వ్రాయటం మొదలుపెట్టిన ఈ కథలు నెమ్మదిగా పెద్దవాళ్ళకి కూడా అత్యంత ప్రీతిపాత్రంగా మారాయి.

ఆ ముప్ఫై ఐదు కథలన్నీ ఈ రెండు సంపుటాలుగా ముద్రించబడ్డాయి. ఇందులో ప్రధాన పాత్ర "ఫెలూదా", అసలు పేరు ప్రదోష్ మిట్టర్. ఈ పాత్ర షెర్లాక్ హోంస్ పాత్రతో సమానం అనుకోవచ్చు. అతనికి అసిస్టెంటు "తోప్షే", అతనిది వాట్సన్ పాత్ర. షెర్లాక్ హోంస్ నవలలో "మైక్రాఫ్ట్" అని అతని అన్న పాత్ర ఒకటుంటుంది. అతను అద్భుతమయిన మేధా శక్తి కలిగి ఉంటాడు, ఎన్నో విషయాలలో నడిచే ఎన్‌సైక్లోపీడియా. చాలా మంచి రీజనింగ్ కలిగి ఉంటాడు. చాలా సార్లు షెర్లాక్ హోంస్ అతని మేధా శక్తిని తన కంటే ఎంతో ఎక్కువగా పరిగణిస్తుంటాడు. కొన్ని సార్లు అవసరమయిన సమాచారం కోసం అతనిని సంప్రదిస్తుంటాడు కూడా. అలాంటి ఒక పాత్ర "ఫెలూదా" నవలలో కూడా ఉంటుంది. అదే "సిద్ధు".
ఈ పాత్రలన్నీ పోలికలున్నవి. ఇది కాక ఫెలూదా కథలలో "లాల్‌మోహన్ గంగూలీ" అని ఇంకో పాత్ర ఉంటుంది. డిటెక్టీవ్ కథలు రాసే రచయిత ఇతను. కథలలో జోకర్ :-)

ఈ పాత్రలతో అల్లిన ఫెలూదా కథలు ఎన్నో మిస్టరీలు ఛేదిస్తాయి. పోలిక కూడదనుకున్నా షెర్లాక్ హోంస్ కథలతో పోలిస్తే ఆ స్థాయి లేదు. అందులో ఒక నలభై శాతం వరకూ తూగుతుందనిపిస్తుంది.
కానీ అలా పోల్చలేం ఎందుకంటే ఈ నవలలు నాకు పంచిన అనుభవం చాలా బాగుంది. నేను ఇవి చదివి బాగా ఎంజాయ్ చేసాను.
షెర్లాక్ హోంస్‌తో ప్రేరణ పొందిన ఈ కారెక్టర్లను తనదయిన శైలిలో నడిపించాడు సత్యజిత్ రే. పాత్రల చిత్రణలో, కథా గమనంలో పూర్తిగా భారతానికి తగినట్టుగా మలచాడు. కథలోని కారెక్టర్లు బెంగాలీ అయినా కథ ప్రకారం వారు ఎన్నో ప్రదేశాలకు వెళతారు. వారణాసి, ఒరిస్సా, ఇంకా ఎన్నో నగరాల్లో కథా గమనం సాగుతుంది.
నాకు అన్నిటికన్నా నచ్చింది ఇదే. కథ సాగే ఆయా ప్రదేశాల గురించీ, ప్రజల గురించీ, అక్కడ జీవితాల గురించీ చక్కని రీసెర్చ్ చేసినట్టు కనబడుతుంది. చక్కగా సెటప్ చేస్తాడు కథని. తర్వాత మలుపులు తిప్పి కథని ముగిస్తాడు.
నాకు నచ్చిన ఇంకో విషయం పాత్రల చిత్రణ. పాత్రలని తగినట్టుగా చిత్రిస్తాడు. ఉదా: మగన్‌లాల్ పాత్ర లాంటివి.

నాకు నచ్చనిది కొన్ని సార్లు రిపిటీటీవ్‌గా అనిపిస్తాయి కొన్ని సంగతులు. ఉదా: చాలా సార్లు కథలో యాంటిక్ వస్తువుల గురించి ఉంటుంది. అలాగే జటాయు (లాల్‌మోహన్) పాత్రని కేవలం హాస్యమాడడానికే ప్రత్యేకంగా చిత్రించినట్టు అనిపిస్తుంటుంది. అంత పేరున్న రచయితకి కనీసం ప్రాథమిక విషయాలు తెలీకపోవడం కొద్దిగా ఎబ్బెట్టుగా ఉంటుంది.

కానీ మొత్తమ్మీద చూస్తే నాకు మంచి అనుభవమే మిగిల్చింది అని చెప్పాలి. మంచి అనుభవం పంచిన సత్యజిత్ రే కీ ఫెలూదాకీ కృతజ్ఞతలు.

* షెర్లాక్ హోమ్స్‌కి సంబంధించిన కథలు, పుస్తకాలన్నిటినీ మీరు గుటెన్‌బర్గ్ నుంచి దిగుమతి చేసుకుని చదువుకోవచ్చు. పీడీఫ్ వర్షన్లు కావాలంటే ఇక్కడ నుంచి తెచ్చుకోవచ్చు.

8 comments:

Deepthi Mamiduru(దీప్తి మమిడూరు) said...

chala baga rasaru and thanks for the link to sherlock holmes series...

కొత్త పాళీ said...

డయిల్ గారి హోంసే, అంతకు మునుపు ఎడ్గర్ ఏలన్ పో సృష్టించిన మరో డిటెక్టివ్ ప్రేరణతో ప్రాణం పోసుకున్నవాడు.
పోగారి కథనాలు డాయిల్ గారి కథనాలంత ఉత్కంఠభరితంగా ఉండవు గానీ చదవ దగినవే.

శరత్ said...

షెర్లాక్ హోంస్ కంప్లీట్ వాల్యూం తెచ్చుకొని మా నాన్న గారు ఎంతో ప్రీతి పాత్రంగా చదివేవారు. నేను మొత్తం ఇంకా చదవలేకపోయాను. అప్పట్లో తెలుగు డిటెక్టివ్ నవల్స్ మాత్రం బాగా చదివేవాడిని.

రవి said...

ఇంగ్లీషులో పెద్దగా సీను లేకపోవడం వల్ల నేను ఇవి చదవలేదు :-(. మొత్తానికి ఫిలాసఫీ పుస్తకాలకు అవతల ఇంకో ప్రపంచం ఉందని తెలిసింది!

సత్యజిత్ రే ఫెలూదానే కాకుండా, హారర్ కథలు కూడా ఉన్నాయి. ఒక్కసారి చదవడం మొదలెడితే ఆపలేరు. గారంటీ. ప్రయత్నించండి.

Purnima said...

బోలెడన్ని కబుర్లు చెప్పుకోడానికి వీలున్న టపా! కానీ ఈ డబ్బాలో నా డబ్బా మొదలెట్టచ్చో పెట్టకూడదో.. అయినా సరే.. గబగబా చెప్పేస్తా..

> Hound of Baskerville, మాకు పదో తరగతిలో నాన్-డిటేల్. నేను నా లాంగ్వేజ్ టెక్ట్స్ అన్నీ అట్టలేయకముందే చదివేసేదాన్ని. తెలుగు వాచకంలో పద్య భాగం కష్టం కాబట్టి, భావాలు చదివేసి ఊరుకునేదాన్ని. అప్పుడేమయ్యిందో గుర్తు రావటం లేదు కానీ, నేను ఇంట్లో అర్థరాత్రి ఒంటరిగా నిద్రపోకుండా ఉండాల్సి వచ్చింది ఒక రోజున( ఏదో ఎమెర్జెన్సీ) బోర్ కొడుతుందని ఈ పుస్తకం తీసా.. నా తిప్పలు అన్నీ-ఇన్నీ కావు! పుస్తకం పెట్టిన భయం కన్నా, పరిస్థితులు ఎక్కువ పెట్టాయనుకుంటా. నాకు చాలా నచ్చిన పుస్తకం.

> మీరిప్పుడు చదువుతున్న బారిష్టరు పార్వతీశం, పదో తరగతి నాన్-డీటేల్. మా తెలుగు టీచర్ నాన్-డీటేల్ ని క్లాసులో మా చేతే చదివించేవారు, ఒక్కోరు ఒక్కో పేరా చదవాలి. ఓ అమ్మాయి లేచి చదువుతున్నా, పుస్తకం ఎదురుగా ఉంటే మన కళ్ళూ పరుగులు తీస్తాయి కదా. ఎక్కడో చోట పుస్సుకుమంటాం త్వరగా చదివే నాలాంటి వాళ్ళు. అది ఇంకో ఇద్దరు ముగ్గురు అందుకుంటారు. చదువుతున్న అమ్మి ఇవేమీ పట్టించుకోకుండా పూర్తి చేయాలి. కష్టపడి పూర్తి చేస్తుంది. కానీ ఆ పాటికే క్లాసంతా గొల్లుమంటుంది. కలిసి చదువుతూ నవ్వుతూ ఆనందించిన క్షణాలవి. గుర్తు చేసినందుకు ధన్యవాదాలు! మీరూ ఆ రచనను ఒక్కరికన్నా, pull somebody. ఎవరూ లేకపోతే అమ్మని బుక్ చేయడమే! :-)

> ఫెలూదా గురించి చెప్పమని అడుగుదామనుకున్నా.. మీరే చెప్పేసారు.పార్వతీశం కబుర్లు మొసుకొచ్చే వరకూ, ఎదురు చూస్తాను.

పూర్ణిమ

ప్రవీణ్ గార్లపాటి said...

@ దీప్తి గారు:
షెర్లాక్ హోంస్‌ని నా టపా ద్వారా ఇంకొందరయినా చదవాలనేదే నా కోరిక.

@ కొత్త పాళీ:
ఓ! ఈ విషయం నాకు తెలీదు. థాంక్యూ చెప్పినందుకు.
దొరికితే చదువుతా అవీ.

@ శరత్:
తప్పకుండా చదవండి. డిటెక్టీవ్‌లకే మాస్టరయిన ఆయనని పూర్తిగా చదవకపోతే ఎలా ?

@ రవి:
వావ్! ఇంకో తెలీని సంగతి తెలిపినందుకు థాంకులు.

@ పూర్ణిమ:
హహ! మీ కబుర్లు బాగున్నాయి.
"Hound of Baskervilles" ఒకటే కాదు ఆ తరువాత "The Adventure of Blue Carbuncle" కూడా నాన్ డీటెయిల్‌గా చదివాను నేను.
మంచి కథ అది కూడా.

బారిష్టరు పార్వతీశం నా చిన్నప్పుడు చదివిందే. తీపి గుర్తులు మళ్ళీ నెమరేసుకోవడానికి. బెంగుళూరులో పుస్తక ప్రదర్శన ఉంటే ఆదివారం విశాలాంధ్రలో కొన్నా. ఓ నాలుగు పుస్తకాలు లైనులో ఉన్నాయి లెండి. :-)

Manohar said...

ఒక పుస్తకంలో పాత్రలకి రచయిత మాత్రమే పూర్తిగా భాధ్యుడు. అయితే సినిమా విషయానికి వచ్చేసరికి మీరన్నది సరిగ్గా అతకదేమోనని నా అభిప్రాయం. ఎందుకంతే రచయిత మనకి ఒక నెపధ్యాన్ని మాత్రమే ఇస్తాడు. ఆ నేపధ్యాన్ని అధారంగా చేసుకుని మనమే ఆ దృశ్యాన్ని పూర్తి చేసుకుంటాం. కాని సినిమా అలా కాదు. అది నటకుల హావభావాల మీద అదారపడి ఉంటుంది. పాత్ర ఎంత గొప్పదైనా ఆ గొప్పదనాన్ని సదరు పాత్రధారి పలికించలేకపోతే అంతా వ్యర్ధం అవుతుంది. ఏమంటారు?

బారిష్టర్ పార్వతీశం, పదవ తరగతి లో ఒక పార్ట్ మాత్రమే ఉంది. ఐతే పార్వతీశం లండన్ లో చదువుకోవడం, మళ్ళీ తిరిగి రావడం, లాయర్ వృత్తిని చేపట్టడం, అక్కడ అలవాట్లు మానలేక ఇబ్బంది పడడం, చాల బగుంటుంది.

www.teluguone.com లో మొత్తం మూడు భాగాలు దొరుకుతున్నాయి, నేను అన్నిటిని కలిపి ఒక పి.డి.ఎఫ్ గా తయారు చేసుకుని చదివాను.

ప్రవీణ్ గార్లపాటి said...

@ Manohar గారు:
అవును. నేను చెప్పింది ఉద్దేశ్యం ఒక రచయిత ఆ పాత్ర ఆలోచించలేకపోతే, ఆ పాత్ర భావాలు, ఆహార్యం చెప్పకపోతే ఆ సినిమాలో ఆ హీరో పాత్ర ఉండదు కదా అని.
ఆ పాత్రని పండించడంలో కథానాయకుడి/నాయకురాలి పాత్ర ఉందనేది మాత్రం ఖచ్చితంగా నిజం.

అవునండోయ్! నేను చదివించి కేవలం మొదటి పార్టు మాత్రమే. ఇప్పుడు నేను కొన్నది మాత్రం మూడూ ఉన్న సమగ్రమయినది.