నేను ఈ టపా రాసేటప్పటికే అంతర్జాలమంతా గూగుల్ వాడి కొత్త నిర్వహణా వ్యవస్థ (ఆపరేటింగ్ సిస్టం) గురించి హోరెత్తుతుంటుంది.
ఇంతకీ ఆ ప్రకటన సారాంశమేమిటంటే గూగుల్ లినక్స్ కెర్నెల్ ఆధారితంగా ఒక కొత్త నిర్వహణా వ్యవస్థని ఈ సంవత్సరం విడుదల చేయనుంది. దీని ముఖ్యోద్దేశం ఒక విహరిణిని నిర్వహణా వ్యవస్థగా మలచడం.
(నిజం చెప్పుకోవాలంటే ఇది పెద్ద ఆశ్చర్యపరచే ప్రకటన కాదు. గూగుల్ క్రోమ్‌ని విడుదల చేసినప్పుడే దానిని ఒక విహరిణిగా కాక ఒక ప్లాట్‌ఫారంగా ఉపయోగించుకుంటుందని చాలా మంది ఊహించారు. ఇప్పుడు అది నిజమయింది అంతే!)
ఇంతకు ముందు కూడా నా టపాలలో ప్రస్తుతం ఆన్లైను ఉపకరణాలు ఎలా విస్తరిస్తున్నాయో చెప్పటానికి ప్రయత్నించాను. అలాగే ఆన్లైనుకీ ఆఫ్లైనుకీ మధ్య దూరాన్ని ఎలా చెరిపేస్తున్నాయో కూడా చెప్పడానికి ప్రయత్నించాను. ఇప్పుడు దానిని ఇంకో అడుగు ముందుకు వేయించడానికి గూగుల్ ఈ ఆలోచనతో ముందుకు వచ్చింది.
"గూగుల్ క్రోమ్ ఆపరేటింగ్ సిస్టమ్" లక్ష్యమేమిటో వారి బ్లాగు టపాలో ఈ క్రింది వాక్యం చెబుతుంది.
The software architecture is simple — Google Chrome running within a new windowing system on top of a Linux kernel. For application developers, the web is the platform
అంటే ఈ నిర్వహణా వ్యవస్థ ముఖ్య ఉపయోగం వినియోగదారుడికి ఒక విహరిణిని అందించేంత వరకే. తర్వాత కార్యకలాపాలన్నీ విహరిణి పైనే (గూగుల్‌కి గూగుల్ క్రోమ్).
అయితే ఈ ఆలోచన కొత్తదేమీ కాదు. ఇప్పటికే నెట్‌బుక్‌ల పేరిట ఇలాంటి ప్రయత్నాలు జరిగాయి. సఫలమయ్యాయి. ఈ నెట్‌బుక్‌ల కోసం ఇప్పటి వరకూ ప్రముఖంగా విండోస్ ఎక్స్పీ, లినక్సు ఉపయోగించబడ్డాయి. ఉబుంటు తయారీదారులు కానానికల్ వారయితే దీని కోసం ఒక ప్రత్యేకమయిన ఉబుంటు వర్షనుని (Ubuntu Netbook Remix) కూడా సృష్టించారు.
ఇది మనకి ఎబ్బెట్టుగా అనిపిస్తుందేమో కానీ ఇది పరిణామ క్రమం. ప్రస్తుత కాలం వరకూ మన కార్యకలాపాలన్నిటికీ మనం ఒక పటిష్ఠమయిన నిర్వహణా వ్యవస్థ మీద ఆధారపడ్డాము. దానిని మైక్రోసాఫ్టు విండోసు, లినక్సు, ఆపిల్ వాడి మాక్ వంటివి అందించేవి.
అయితే ప్రస్తుత పరిణామాలన్నీ పై క్రమాన్ని వదిలి మన కార్యకలాపాలని ఆన్లైనుకి మారుస్తున్నాయి. ఉదా: ఆఫీసు ఉపకరణాలు మొదలయినవి గూగుల్ డాక్స్, జోహో ద్వారా లభ్యం. అలాగే అంతర్జాలంతో అనుసంధానం కాకపోయినా పని చేసుకోవడానికి గూగుల్ గేర్స్ వంటి ఉపకరణాలూ లభ్యం.
అయితే మరి గూగుల్‌కి దీని వల్ల లాభం ఏమిటి ?
ముఖ్యంగా చెప్పుకోవాలంటే గూగుల్ మైక్రోసాఫ్టు, ఆపిల్ వంటి వాటిని నిర్వహణా వ్యవస్థలో ఎదుర్కొనలేదు. వాటికి పోటీనివ్వలేదు. అయినా ఈ నిర్వహణా వ్య్వస్థని ఎందుకు సృష్టిస్తుందంటే గూగుల్ క్రోమ్ ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా అవి ఆక్రమించని వ్యాపారాన్ని ఇది త్వరగా ఆక్రమించడానికి ప్రయత్నిస్తుంది.
గూగుల్ వాడి ఆస్తులన్నీ ఆన్లయిననే సంగతి అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ నిర్వహణా వ్యవస్థ ద్వారా వినియోగదారులని విహరిణికి అతుక్కునేలా చెయ్యగలగడం ఒక ముఖ్యోద్దేశం.
ఇక ఇది గూగుల్ యొక్క నిర్వహణా వ్యవస్థ కాబట్టి ప్రతీ దాంట్లోనూ గూగుల్ ఉపకరణాల అనుసంధానం ఉంటుందని మనం ఊహించవచ్చు. ఎలాగంటే మీరు మెయిలు పంపాలంటే జీ-మెయిలు తెరుస్తుంది. మీరు ఒక డాక్యుమెంటు సృష్టించాలంటే గూగుల్ డాక్స్ తెరుస్తుంది. ఎవరికయినా Instant Message పంపాలంటే గూగుల్ టాక్ తెరుస్తుంది.
ఇలా గూగుల్ ఉపకరణాలన్నీ ప్రీ ఇన్స్టాల్ అయి రావచ్చు. వినియోగదారుడికి కావలసిన అన్ని సేవలకూ గూగుల్ ఉపకరణాలని ఉపయోగించేలా ప్రేరేపించవచ్చు. ఇందువల్ల లాభాలు అందరికీ విదితమే.
గూగుల్ అన్ని ఉపకరణాల లాగానే ఇది కూడా ఉచితంగా లభ్యమవుతుంది, ఓపెన్ సోర్స్ అయి ఉంటుంది. ఓపెన్ సోర్స్ చెయ్యడం వల్ల జనాల్ని ఉచితంగా తన పని కోసం వినియోగించుకోవచ్చు, త్వరగా ఫీచర్లని విడుదల చెయ్యవచ్చు, ప్లాట్‌ఫారంని ఎక్స్టెన్సిబుల్‌గా తయారు చెయ్యవచ్చు. అదీ కాక గూగుల్‌కి ఉన్న బ్రాండ్ నేమ్ ద్వారా జనాల్లోకి చొచ్చుకుపోవడానికి ప్రయత్నిస్తుంది.
ఇక దీని భవిష్యత్తేమిటో చూడడానికి ఆసక్తికరంగా ఉంటుంది.
ఇది చూడండి:
ఒక రకంగా గూగుల్ ఇప్పటికే ఒక ఓపెన్ సోర్సు నిర్వహణా వ్యవస్థని రూపొందించింది. అది ఆండ్రాయిడ్, అయితే అది మొబైళ్ళ కోసం తయారు చెయ్యబడినది. ఇప్పటికే ఆండ్రాయిడ్‌ని నెట్‌బుక్‌ల మీద పని చేయించడం కోసం వివిధ హార్డువేరు సృష్టికర్తలు ప్రయత్నిస్తున్నారు.
లినక్సు వాడే వారికి X11 విండో సిస్టం గురించి తెలిసే ఉంటుంది. నాకు అదంటే పెద్ద ఇష్టం లేదు. అంత స్టేబుల్‌గా ఉండదు. గూగుల్ ప్రకటనలో నాకు ఈ కింది వాక్యం ఆసక్తికరంగా అనిపించింది.
Google Chrome running within a new windowing system on top of a Linux kernel.
అయితే ఇప్పుడు లినక్సుకి ఒక సరికొత్త విండో సిస్టం వస్తుందేమో ? :-)